సిరిసిల్ల టౌన్, సెప్టెంబర్ 29 : కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంతోనే సిరిసిల్లలో నేత కార్మికుల ఆత్మహత్యలు జరుగుతున్నాయని బిఆర్టియు జిల్లా అధ్యక్షుడు వెంగళ శ్రీనివాస్ ఆరోపించారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయం మంగళవారం వద్ద నేత కార్మికుల కుటుంబ సభ్యులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ.. బతుకమ్మ చీరల ఆర్డర్లు బందు పెట్టి నేత కార్మికుల ఆత్మహత్యలకు కారణమైంది కాంగ్రెస్ ప్రభుత్వం అని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వo నిర్లక్ష్యం కారణంగా 35 మంది కార్మికులు ఇప్పటివరకు ఉపాధి లేక ఆత్మహత్యలు చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నేతన్నల సమస్యలపై ఇచ్చిన హామీలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. నేత కార్మికుల ఆత్మహత్యలను కేవలం గణాంకాలుగా చూడకుండా, వారి కుటుంబాల భవిష్యత్తును ప్రభుత్వం బాధ్యతగా తీసుకోవాలని హితవు పలికారు. ప్రభుత్వ విధానాల వల్లే తమ కుటుంబ సభ్యులను కోల్పోయామని బాధపడుతున్న కుటుంబాలకు అండగా నిలవాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై ఎంతైనా ఉందన్నారు.
సిరిసిల్ల పర్యటనకు వస్తున్న సీఎం రేవంత్ రెడ్డి చనిపోయిన 35 మంది కుటుంబాలను పరామర్శించి వారికి రూ. 25 లక్షలు ఎక్స్‌గ్రేషియో చెల్లించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా సదరు బాధిత కుటుంబాలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కేటాయించి ఆదుకోవాలని అన్నారు. నేత కార్మికుల సమస్యలు పరిష్కరించే వరకు తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో బిఆర్టియు పట్టణ అధ్యక్షుడు పోరండ్ల రమేష్, బాధిత నేత కార్మిక కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.