Adluri Laxman Kumar | ధర్మారం, అక్టోబర్ 7 : దేశవ్యాప్తంగా ప్రజల ఓట్లను చివరి చేస్తూ పీఎం నరేంద్ర మోడీ రాక్షస పాలన కొనసాగిస్తున్నాడని రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆరోపించారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం చామనపల్లి గ్రామంలో గురువారం ఇండ్లు ముంపునకు గురయ్యే నిర్వాసితులతో ఆయన ప్రత్యేక సమావేశం నిర్వహించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. నంది రిజర్వాయర్ బ్యాక్ వాటర్ తో ఇండ్ల ముంపు సమస్య పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ హామీ ఇచ్చారు. నరేంద్ర మోడీ పాలనలోని ఓట్ల చోరీ జరుగుతుందనే విషయాన్ని ప్రజలందరూ గమనిస్తున్నారని ఆయన పేర్కొన్నారు.
దేశంలోని అనేక రాష్ట్రాలలో సర్ ప్రక్రియ పేరిట ఓట్ల చోరీ జరిగిందని దేశంలోని ప్రధాన ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ తో సహా ఇతర పార్టీలు ఆధారాలతో బయటపెట్టినప్పటి కూడా కేంద్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తూ భారత ప్రధాన ఎన్నికల అధికారి జ్ఞానేశ్వర్ ను పదవి నుంచి తప్పించకుండా వెనుకేసుకొని రావడం సిగ్గుచేటు అని విమర్శించారు. ఓట్ల చోరీ పై ఢిల్లీలో కాంగ్రెస్ అగ్ర నేతలు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ నిరసన చేపడితే వారిని కేంద్ర ప్రభుత్వం అరెస్టు చేయడం ప్రజాస్వామికమని ఆయన ధ్వజమెత్తారు. వారి అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నట్లు లక్ష్మణ్ కుమార్ తెలిపారు. రానున్న కాలంలో దేశ ప్రజలంతా బీజేపీ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పే సమయం ఆసన్నమైందని లక్ష్మణ్ కుమార్ స్పష్టం చేశారు. ఈ సమావేశంలో చామనపల్లి సర్పంచ్ వేల్పుల రేవతి, నాయకులు ఎల్ రూప్లా నాయక్, చింతల ప్రదీప్ రెడ్డి, దాగేటి ఉదయ్ తదితరులు పాల్గొన్నారు.