కొత్తపల్లి, ఏప్రిల్ 15 : హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్ఏ)కు అనుబంధమైన కరీంనగర్ జిల్లా క్రికెట్ అసోసియేషన్(కేడీసీఏ) ఆధ్వర్యంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఉచిత వేసవి క్రికెట్ శిక్షణ శిబిరాలను నిర్వహిస్తున్నట్లు కేడీసీఏ అధ్యక్షుడు ఆగం రావు తెలిపారు. సోమవారం శిక్షణ శిబిరాలకు సంబంధించిన వాల్ పోస్టర్‌ను క్రికెట్ సంఘం కార్యాలయంలో ఆవిష్కరించి, వివరాలు వెల్లడించారు. అండర్-14, అండర్-16, అండర్-19, అండర్-23 విభాగాల్లో బాలబాలికలకు వేరువేరుగా శిక్షణ శిబిరాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు.
ఉదయం 6 నుంచి 9 గంటల వరకు నిపుణులైన కోచ్‌ల ఆధ్వర్యంలో కొనసాగుతాయన్నారు. ఉమ్మడి జిల్లాలోని కరీంనగర్, గోదావరిఖని, రాజన్న సిరిసిల్లలో శిబిరాలు ఏర్పాటు చేయనున్నామని, ఈ నెల 20 నుంచి మే 20 వరకు కొనసాగుతాయన్నారు. గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఉచిత శిక్షణ శిబిరాలను నిర్వహిస్తున్నామన్నారు.
శిక్షణ శిబిరాల్లో ప్రతిభ కనబరిచే క్రీడాకారులకు హెచ్‌సీఏ, కేడీసీఏ ఆధ్వర్యంలో నిర్వహించే జిల్లా, రాష్ట్రస్థాయి టోర్నమెంట్లకు ఎంపిక చేస్తామన్నారు. ఆసక్తిగల క్రీడాకారులు తమ పేర్లను WWW.hycricket.org వెబ్సైట్లోకి లాగిన్ అయి తమ వివరాలను నమోదు చేసుకోవాలని సూచించారు. ఈ వెబ్సైట్ ద్వారా ఈ నెల 16 నుంచి 18 లోపు అర్హులు తమ పేర్లను నమోదు చేసుకోవాలని, పూర్తి వివరాలకు 80087 29397 నెంబర్లో సంప్రదించాలన్నారు. సమావేశంలో క్రికెట్ సంఘం కార్యదర్శి ఎన్ మురళీధర్‌రావు, పీ మనోహర్‌రావు, కిరణ్‌కుమార్ పాల్గొన్నారు.