Allipur | సుల్తానాబాద్ రూరల్, జూన్ 19 : వర్షాలు కురవాలని కోరుతూ కప్పతల్లి ఆట ఆడారు. దేవతలకు జలాభిషేకం చేశారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని అల్లిపూర్ గ్రామంలో శుక్రవారం గ్రామస్తుల ఆధ్వర్యంలో వర్షాలు కురవాలని, ప్రజలను సుభిక్షంగా ఉంచాలని కోరుతూ కప్పతల్లి ఆట కార్యక్రమాన్ని చేపట్టారు. గ్రామ పురవీధుల గుండా డప్పు చప్పులతో ర్యాలీ నిర్వహించారు.
ఇంటింటా తిరుగుతుంటే మహిళలు బిందెలతో నీళ్లు పోసి దీవించారు. బొడ్రాయి, పోచమ్మ తల్లి, ఎల్లమ్మ తల్లి, మల్లన్న ఆలయాలను సందర్శించి, దేవతలకు జలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, పాలకవర్గ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొని వర్షాలు కురవాలని వేడుకున్నారు.