Ponnam Prabhakar | చిగురుమామిడి, అక్టోబర్ 7 : గౌరవెల్లి ప్రాజెక్టు ఎంఎంఆర్ ప్యాకేజీ కి సంబంధించిన పెండింగ్ పనులను త్వరగా పూర్తి చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని, అవసరమైన అనుమతులు ప్రక్రియను పూర్తి చేస్తుందని రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ప్రజా పాలనలో భాగంగా మండలంలోని ముదిమాణిక్యం, రామంచ, ముల్కనూర్, పీ సీతారాంపూర్ గ్రామాల్లో ప్రభుత్వ సంక్షేమ పథకాలు కార్యక్రమాలపై వివిధ శాఖల అధికారులతో సమీక్షించారు. అనంతరం గ్రామపంచాయతీ కార్యాలయాల వద్ద ఏర్పాటుచేసినప్రజా పాలనలో జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా తో కలిసి బుధవారం పాల్గొన్నారు. గౌరవెల్లి ప్రాజెక్టు కోసం చాలాకాలంగా భూసేకరణ, పరిహారం తదితర అంశాల్లో ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. పనులను వేగవంతం చేసి త్వరితగతిన సాగునీరు రైతులకు అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. హుస్నాబాద్ నుండి కొత్తపల్లి వరకు నాలుగు వరుసల రహదారి నిర్మాణంలో ఇల్లు కోల్పోయిన వారికి ఇల్లు మంజూరు చేస్తామని పూర్తిగా ఇల్లు కోల్పోతే ప్రభుత్వం నిబంధనల ప్రకారం వారికి ప్రభుత్వ భూమి కేటాయించి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామన్నారు.
సమస్యల పరిష్కారానికి కృషి: కరీంనగర్ కలెక్టర్ చిత్రా మిశ్రా
గ్రామాల్లో ఉన్న సమస్యలను గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద ఏర్పాటుచేసిన ప్రజాపాలనలో నేరుగా సమస్యలు పరిష్కరించేందుకు ఎంతో ఉపయోగపడుతుందని కరీంనగర్ కలెక్టర్ చిత్రా మిశ్రా అన్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ తో కలిసి ప్రజాపాలనలో పాల్గొన్నారు. మంత్రికి గ్రామ ప్రజలు ప్రజాప్రతినిధులు వినతి పత్రాలు అందజేయడం వల్ల ప్రజల సమస్యలు నేరుగా అధికారులు తెలుసుకునే అవకాశం ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ ఆర్డీవో షర్మిల, మార్కెట్ కమిటీ చైర్మన్ కంది తిరుపతిరెడ్డి, సింగల్ విండో చైర్మన్ చిట్టిమల్ల రవీందర్, వడ్డెర కార్పొరేషన్ వైస్ చైర్మన్ బత్తుల వెంకటేష్, ఆయా గ్రామ సర్పంచ్లు భోయిని రమేష్, ఒంటెల కిషన్ రెడ్డి, సాంబారి భారతమ్మ కొమురయ్య, పీచు సత్యనారాయణరెడ్డి, గోగూరి లక్ష్మి, మండల ప్రత్యేక అధికారి, ఆత్మా పీడీ శత్రు నాయక్, కరీంనగర్ రూరల్ ఏసీపీ విజయ్ కుమార్, తహసీల్దార్ కోడం కనకయ్య ఎంపీడీవో జగన్మోహన్ చారి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.