Karimnagar | ఎల్నీనో ఎఫెక్ట్.. ఎండుతున్న పంటలు.. కరువు కోరల్లో కరీంనగర్
ఆకాశం కరుణించడం లేదు. జలాశయాలు జలకళను కోల్పోతున్నాయి. భూగర్భ జలాలు పాతాళానికి పడిపోతున్నాయి. మరోవైపు విద్యుత్ కోతలు రైతుల సహనాన్ని పరీక్షిస్తున్నాయి. ఎల్నీనో ప్రభావంతో జిల్లాలో వర్షాభావ పరిస్థితులు ముదురుతుంటే, పంటలను కాపాడాల్సిన ప్రభుత్వ యంత్రాంగం మాత్రం ప్రకటనలకే పరిమితమైందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
- కాగితాలకే పరిమితమైన ప్రభుత్వ సన్నద్ధత
- కరెంట్ కోతలు.. అడుగంటుతున్న భూగర్భ జలాలు
- చివరి తడికి రైతుల తిప్పలు
- మూడు మండలాలకే కరువు ముద్ర
- జిల్లావ్యాప్తంగా అన్నదాతల ఆందోళన
Karimnagar | కరీంనగర్ కలెక్టరేట్, అక్టోబర్ 27 : ఆకాశం కరుణించడం లేదు. జలాశయాలు జలకళను కోల్పోతున్నాయి. భూగర్భ జలాలు పాతాళానికి పడిపోతున్నాయి. మరోవైపు విద్యుత్ కోతలు రైతుల సహనాన్ని పరీక్షిస్తున్నాయి. ఎల్నీనో ప్రభావంతో జిల్లాలో వర్షాభావ పరిస్థితులు ముదురుతుంటే, పంటలను కాపాడాల్సిన ప్రభుత్వ యంత్రాంగం మాత్రం ప్రకటనలకే పరిమితమైందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సాగు సమయంలో అంచనాలకు మించి పంటలు వేసిన రైతులకు ఇప్పుడు చివరి తడులే గగనమవుతున్నాయి. పంట చేతికొచ్చే సమయంలో ప్రకృతి ప్రకోపం.. పాలకుల ప్రణాళికా లోపం అన్నదాతకు శాపంగా మారుతున్నాయనే ఆవేదన వారినుంచి వ్యక్తమవుతున్నది.
సాగు చేశారు.. సాయం కోసం ఎదురుచూస్తున్నారు!
వానాకాలం ప్రారంభం నుంచి సెప్టెంబర్ చివరి వరకు ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడంతో పంటలు నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నాయి. సాధారణంగా పంటలకు ఊపిరిపోసే వర్షాకాలమే ఈసారి రైతులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ప్రస్తుతం 36–37 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో నేలలో తేమ వేగంగా తగ్గుతోంది. గంగాధర, కరీంనగర్ రూరల్, శంకరపట్నం, హుజూరాబాద్, చొప్పదండి, తదితర ప్రాంతాల్లో మరో 15–20 రోజుల్లో వరి కోతకు వచ్చే అవకాశమున్నా, అంతకుముందు అందించాల్సిన చివరి తడులే ప్రశ్నార్థకంగా మారాయి. పంటను కాపాడుకునేందుకు రైతులు పడుతున్న ఆరాటం అధికార యంత్రాంగానికి ఎందుకు కనిపించడం లేదన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
ఆందోళనలు చేసినా.. అందని సాగునీరు!
జలాశయాల నుంచి సాగునీటిని విడుదల చేయాలని బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఆందోళనలు చేపట్టడం, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఆధ్వర్యంలో రైతులు కాలువల వద్ద నిరసనకు దిగడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ఆందోళనల నేపథ్యంలో నీటిని విడుదల చేసినా ఆయకట్టులో చివరి మడులకు చేరడం లేదని రైతులు వాపోతున్నారు. నీటి విడుదలపై ప్రకటనలు చేయడం కాదు.. చివరి ఎకరా వరకు నీరు చేరేలా చూడటం ముఖ్యం కాగా, కాలువల చివర ఉన్న రైతుల పంటలు ఎండిపోతుంటే అధికారుల పర్యవేక్షణ ఎక్కడుందన్నది కీలక ప్రశ్నగా మారింది.
మూడు మండలాలకే కరువా..?
ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం వర్షపాతం, భూగర్భ జలాలు, నేలలో తేమ, జలాశయాలు, చెరువుల్లో నీటి నిల్వలను పరిగణనలోకి తీసుకొని జిల్లాలో మూడు మండలాల్లోనే కరువు పరిస్థితులు ఉన్నట్లు గుర్తించినట్లు సమాచారం. అయితే జూన్ నుంచి సెప్టెంబర్ వరకు నమోదైన వర్షాభావం ప్రభావం జిల్లావ్యాప్తంగా పంటలపై పడుతుండగా, అధికారిక లెక్కల్లో పరిమిత మండలాలకే కరువు పరిస్థితులను కట్టిపెట్టడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. క్షేత్రస్థాయిలో రైతుల కష్టాలు ఒకలా ఉంటే.. ప్రభుత్వ అంచనాలు మరోలా ఉన్నాయన్న ఆవేదన వినిపిస్తోంది. కరువు తీవ్రతను కేవలం గణాంకాలతో కొలిస్తే రైతుల నష్టాలను ఎవరు గుర్తిస్తారన్న ప్రశ్న తలెత్తుతోంది.
యాసంగిపై అయోమయం.. రైతులకు దిక్కేది?
రాబోయే యాసంగిలో వరి సాగును తగ్గించి, నీటి లభ్యతను బట్టి ఆరుతడి పంటలు సాగు చేయాలని ప్రభుత్వం సూచిస్తోంది. కానీ ఏ గ్రామంలో ఎంత నీరు అందుబాటులో ఉంది? ఏ పంట సాగు చేస్తే లాభదాయకం? విత్తనాలు, మార్కెటింగ్, పెట్టుబడుల విషయంలో రైతులకు ఎలాంటి భరోసా ఉంది? ఈ ప్రశ్నలకు క్షేత్రస్థాయిలో సమాధానాలు కరువయ్యాయి. వ్యవసాయ, రెవెన్యూ, నీటిపారుదల శాఖలు సమన్వయంతో పనిచేసి రైతులకు ముందస్తు మార్గదర్శకాలు ఇవ్వాల్సి ఉండగా, గ్రామాల్లో విస్తృత అవగాహన కార్యక్రమాలు కనిపించడం లేదన్న ఆరోపణలున్నాయి.
ముందుచూపేది.. తక్షణ చర్యలేవీ..?
అక్టోబర్ నుంచే భూగర్భ జలమట్టాలు తగ్గుముఖం పట్టడం భవిష్యత్తులో తాగునీటి అవసరాలపైనా ఆందోళన కలిగిస్తోంది. జలాశయాల్లోని నీటిని తాగునీటి అవసరాలకే పరిమితం చేయాల్సిన పరిస్థితి వస్తే వ్యవసాయానికి నీరు ఎక్కడి నుంచి తెస్తారన్న సందేహం రైతులను వెంటాడుతోంది. ప్రతీ గ్రామంలో నీటి లభ్యతపై సమీక్షలు నిర్వహించి, ప్రత్యామ్నాయ పంటలపై స్పష్టమైన ప్రణాళిక రూపొందించాల్సిన అవసరం ఉంది. విద్యుత్ సరఫరా, సాగునీటి పంపిణీ, భూగర్భ జలాల పరిరక్షణపై తక్షణ చర్యలు చేపట్టాలి. ఎల్నీనో ముప్పు ముందే తెలిసినా, పంటలు ఎండుముఖం పట్టాక స్పందిస్తే ప్రయోజనం ఏమిటి..? నీటిని పొదుపుగా వాడాలంటూ ప్రకటనలు చేయడం సులభమే.. కానీ రైతు పంటను కాపాడే కార్యాచరణ అమలు చేయడం ప్రభుత్వ బాధ్యత. ఇప్పటికైనా పాలకులు ప్రచార ప్రకటనల నుంచి క్షేత్రస్థాయి కార్యాచరణ వైపు అడుగులు వేయాలి. లేదంటే ప్రకృతి దెబ్బకు తోడు ప్రభుత్వ నిర్లక్ష్యం కూడా అన్నదాతకు కోలుకోలేని నష్టాన్ని మిగిల్చే ప్రమాదం ఉందనే చర్చ జరుగుతోంది.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NZvIND: ఇండియా టార్గెట్ 199
Mrunal Thakur | రష్మిక పాత్ర కోసం వెళ్లి సీతగా.. ‘సీతారామం’ చిత్రంలో మృణాల్ ఠాకూర్ ఎంపిక వెనుక అసలు కథ ఇదే.!
Sigma | ఓటీటీలోకి విజయ్ కొడుకు తొలి సినిమా.. సందీప్ కిషన్ ‘సిగ్మా’ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
India-A Vs New Zealand-A: డ్రాగా ముగిసిన ఇండియా-ఏ, న్యూజిలాండ్-ఏ మ్యాచ్
Aadarsha Kutumbam | సెన్సార్ పూర్తి చేసుకున్న ‘ఆదర్శ కుటుంబం’.. ప్రీ-రిలీజ్ ఈవెంట్ నేడే!
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

