కరీంనగర్, ఫిబ్రవరి 16 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ ఫస్ట్ సీఎం కేసీఆర్ తమకే కాదు, అమరుల కుటుంబాలన్నింటికీ పెద్దదిక్కుగా నిలిచారని అమరుడు కానిస్టేబుల్ పుట్టకొక్కుల కిష్టయ్య కూతురు డాక్టర్ ప్రియాంక గుర్తు చేస్తున్నారు. తమను కన్నబిడ్డలా చూసుకున్నారని, ఉద్యమ సమయం నుంచే ‘నేనున్నా’ంటూ భరోసానిచ్చారని ఉద్వేగానికి లోనయ్యారు. ఆయన దీవెనతోనే తాను డాక్టర్‌ను అయ్యాయని, ఇప్పుడు పీజీ చేస్తున్నాని చెబుతున్నారు. శనివారం కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా ‘నమస్తే తెలంగాణ’తో తన కుటుంబాన్ని ఆదుకున్న తీరును పంచుకున్నారు. ఏ తెలంగాణ కోసమైతే తన తండ్రి కిష్టయ్య ప్రాణ త్యాగం చేశారో.. ఆ తెలంగాణను సాధించి తన తండ్రి కన్నకలను కేసీఆర్ సాకారం చేశారని, తనను డాక్టర్ చేయాలన్న మరో కలను నిజం చేశారని చెబుతున్నారు.
ఆమె మాటల్లోనే.. ‘డాడీ చనిపోయినపుడు అన్నయ్య, నేను చిన్న పిల్లలం. ఆ తర్వాత చాలా రోజులకు తెలంగాణ వచ్చింది. అప్పటికీ మేం కాస్త పెద్దయినం. తెలంగాణ రావడంతో చాలా సంతోషించిన. డాడీ కల నెరవేరింది అనుకున్న. డాడీకి రెండే రెండు కోర్కెలు ఉండేవి. ఒకటి తెలంగాణ రాష్ర్టాన్ని చూడడం, నన్ను డాక్టర్ని చేయడం. సీఎం కేసీఆర్ సార్ ఈ రెండు కోర్కెలను నెరవేర్చిండు. డాడీ చనిపోయిన తర్వాత కేసీఆర్ సార్‌ను మా అమ్మ పద్మావతితో వెళ్లి కలిసిన. అప్పుడు ఎంతో ఆప్యాయంగా మాట్లాడిండు. మాకు భోజనం పెట్టించి పంపిండు. నన్ను దగ్గరికి తీసుకుని బాగా చదువుకోవాలని చెప్పిండు. మళ్లీ నా ఇంటర్ పూర్తయిన తర్వాత 2015లో కలిసినం. అప్పుడు నన్ను డాక్టర్ని చేయాలన్న మా డాడీ కోరిక చెప్పిన. ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ఎంట్రెన్స్ రాయాలని చెప్పిండు.
నేను ఎంట్రెన్స్ రాసిన. నాకు కరీంనగర్‌లోని చల్మెడ మెడికల్ కాలేజీలో సీటు ఇప్పించి ఫీజు మొత్తం చెల్లించిండు. ఎంబీబీఎస్ కాగానే బస్తీ దవాఖానలో మెడికల్ ఆఫీసర్‌గా కాంట్రాక్ట్ బేస్‌పై ఉద్యోగంలో చేరిన. కానీ, మెడిసిన్‌లో పీజీ చేయాలనే కోరిక అలాగే ఉండి పోయింది. హైదరాబాద్‌లో అమర జ్యోతి ఆవిష్కరణ రోజు మమ్మల్ని పిలిస్తే మరోసారి సార్‌ను కలిసినం. పీజీ చేయాలనుందని చెప్పిన. నీట్ రాయాలని చెబితే రాసిన. చల్మెడ మెడికల్ కాలేజీలోనే సీటు ఇప్పించిండు.
24 లక్షలు చెల్లించేందుకు ఒప్పుకున్నడు. నిజంగా కేసీఆర్ సార్ గ్రేట్. ఆయన మాటలు చెప్పే నాయకుడు కాదు, ఏదైనా ఆచరణలో చేసి చూపిస్తడు. మాలాంటి ఎన్నో అమరుల కుటుంబాలను నిలబెట్టిండు. అందుకే ఆయనంటే అమరుల కుటుంబాలన్నింటికీ ఇష్టం, అభిమానం. మొన్న కేసీఆర్ సారుకు దెబ్బ తగిలినపుడు మా కుటుంబ సభ్యులు వెళ్లి కలిసిన్రు’ అని చెప్పారు. కేసీఆర్ సార్ ఎప్పటికీ తమ గుండెల్లో నిలిచి ఉంటారని, ఆయన ప్రతి పుట్టినరోజు మా ఇంట్లో పండుగలా చేసుకుంటామని, తమ ఇంట్లో ఇంతకన్న పెద్ద పండుగ ఉండదని ప్రియాంక కృతజ్ఞత చెప్పారు. ‘హ్యాపీ బర్త్‌డే కేసీఆర్ సార్’ అంటూ శుభాకాంక్షలు తెలిపారు.