వేములవాడ, డిసెంబర్ 17 : చదువు కోసమో, ఉద్యోగాల కోసమో, ఉపాధి కోసమో.. ఏదైతేనేం ఎంతో మంది పట్టణాలు, నగరాల్లో స్థిరపడుతున్నారు. మొదట్లో అద్దె ఇండ్లల్లో ఉన్నా.. తర్వాత మాత్రం స్థిర నివాసాలను ఏర్పరుచుకుంటున్నారు. ఆర్థిక స్థోమత ఉన్నవాళ్లు తొందరగానే సెటిల్ అవుతున్నా.. సామాన్యులు మాత్రం కాస్త ఆలస్యంగా సెటిల్ అవుతున్నారు. ఎన్నో ఏండ్లుగా నివాసముంటున్న పట్టణాల్లోనే తమకు సొంతిల్లు ఉండాలని భావించి, ఆ దిశగా అడుగులు వేసి తమ కలల ఇంటిని సాకారం చేసుకుంటున్నారు. భూముల ధరలు ఆకాశాన్నంటుతున్న నేపథ్యంలో తక్కువ స్థలంలోనైనా అందమైన ఇండ్లను నిర్మించుకుంటున్నారు. ఇంజినీర్ల సహకారం, అధునాతన టెక్నాలజీతో 70 నుంచి 100 గజాల్లోపు స్థలంలోనే పొదరిల్లులాంటి ఇండ్లను కట్టుకుంటున్నారు. సింగిల్ బెడ్రూం, డబుల్ బెడ్రూం ఇండ్లే కాదు, డూప్లెక్స్ తరహాలోనూ నిర్మించుకుంటున్నారు. స్థలం చిన్నదే అయినా ఎలివేషన్ (బయట నుంచి చూస్తే కనిపించే ఇంటి ఆకృతి) దగ్గర నుంచి ఇంటీరియల్ డెకరేషన్, వుడ్ వర్క్, ఫ్లోరింగ్, పేయింటింగ్స్ దాకా ప్రతి విషయంలోనూ తమ అభురుచికి తగ్గట్టు ఇంటిని తీర్చిదిద్దుకుంటున్నారు. కరీంనగర్, జగిత్యాల, సిరిసిల్ల, పెద్దపల్లి జిల్లాకేంద్రాలతోపాటు నియోజకవర్గ, మండలకేంద్రాల్లో ఈ అందమైన ఇండ్లను చూసిన వారంతా అబ్బురపడుతున్నారు. దక్షిణకాశీగా ప్రసిద్ధిగాంచిన వేములవాడ పట్టణంలో ఇలాంటి నిర్మాణాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. చూడగానే ముచ్చట గొలుపుతున్నాయి.
మా అమ్మవాళ్లది వేములవాడ. బంధువులు, తెలిసిన వాళ్లంతా ఇక్కడే ఉన్నరు. మా పిల్లలు అమెరికా వెళ్లిన తర్వాత మేం వేములవాడలోనే స్థిరపడాలని అనుకున్నం. అందుకే రాజీవ్‌నగర్‌లో చిన్న స్థలమైనా తీసుకోవాలని అనుకున్నం. రెండేళ్ల క్రితం 75 గజాల స్థలం తీసుకున్న. అందులోనే మంచి ఇల్లు కట్టుకున్నం. 75 గజాల్లో డబుల్ బెడ్రూంతోపాటు కిచెన్, వెయిటింగ్ హాల్ కూడా వచ్చింది. ఇంటీరియర్ డిజైన్‌తో కలిపి 25 లక్షల్లో ఇల్లు పూర్తయింది. చూడడానికి ఇల్లు చాలా బాగున్నది.
– బుర్ర పద్మ, రాజీవ్‌నగర్ (వేములవాడ)
భూముల ధరలు బాగా పెరిగినయ్. కొనలేని పరిస్థితులు ఉన్నయ్. అందుకే నాకు వారసత్వంగా వచ్చిన 75 గజాల స్థలంలోనే ఇంటిని కట్టుకున్న. రూపాయికే ప్రభుత్వం ఇంటి పర్మిషన్ ఇచ్చింది. సింగిల్ బెడ్రూం, కిచెన్, వెయిటింగ్హాల్తో కలిపి 10 లక్షల్లోపు నిర్మాణం పూర్తయింది. ఇంటి ముందు ఒక బైక్ కూడా పార్క్ చేసుకోవచ్చు.
– గణేశ్, భవానీనగర్ (వేములవాడ)
భూముల ధరలు బాగా పెరిగాయి. అందరూ కొనలేని పరిస్థితులు ఉన్నాయి. అందుకే ప్రధాన కాలనీల్లో చిన్న స్థలాల్లోనూ ఇంటిని నిర్మించుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. తక్కువ స్థలంలోనూ కావాల్సిన సౌకర్యాలతో అందమైన ఇళ్లు కట్టుకుంటున్నారు. వేములవాడలోనే ఇప్పటి వరకు దాదాపు 60కి పైగా ఇండ్లను నిర్మించుకున్నారు. యూట్యూబ్ ద్వారా కూడా నిర్మాణాలను ఎప్పటికప్పుడు పోస్టు చేస్తుండడంతో ఆసక్తి ఉన్న యజమానులు సంప్రదిస్తున్నారు. వారి అభిరుచుల మేరకు నిర్మాణాలకు సంబంధించిన డిజైన్లు ఇస్తున్నాం. స్థలానికి పెట్టే డబ్బులతో ఇంటి నిర్మాణాలు పూర్తి చేసుకుంటున్నారు.
– గృహలక్ష్మి రమణ, హోమ్ ప్లానర్ (వేములవాడ)
మాది రుద్రంగి. నేను ప్రైవేట్ జాబ్ చేస్త. 22 ఏళ్ల నుంచి వేములవాడలో ఉంటున్న. రెండేళ్ల క్రితం వరకు రెంట్‌కు ఉండేది. మా చుట్టాలు, స్నేహితులు ఎక్కువగా భవానీనగర్లోనే ఉన్నరు. అందుకే ఆ ఏరియాలో తక్కువ జాగే అయినా వంద గజాలు కొనుక్కున్న. అందులో డూప్లెక్స్ నిర్మించుకున్న. ట్రిబుల్ బెడ్రూంతోపాటు పైన పెంట్‌హౌస్ కూడా వేసుకున్న. ఏడాది కిందటే ఇల్లు పూర్తి చేసి గృహ ప్రవేశం చేసిన. ఇది మా కుటుంబానికి బాగా సరిపోతున్నది.
– ఆమెటి శ్రీనివాస్, భవానీనగర్ (వేములవాడ)
రాష్ట్ర సర్కారు టీఎస్ బీపాస్‌ను తెచ్చి ఇంటి నిర్మాణ అనుమతులను సులభతరం చేసింది. 75 గజాలలోపు స్థలంలో ఇంటిని నిర్మించుకునే వారికి రూపాయికే పర్మిషన్ ఇస్తున్నది. టీఎస్ బీపాస్‌లో రిజిస్టర్డ్ డాక్యుమెంట్‌తో దరఖాస్తు చేసుకుంటే అనుమతులు ఇస్తున్నది. అయితే, ఇంటి ముందు 30 అడుగుల రోడ్డు ఉండాలి. భవన నిర్మాణం 7 మీటర్ల ఎత్తు లేదా జీ ప్లస్ 1 నిర్మాణానికి మాత్రమే అనుమతి ఉంటుంది. ప్రభుత్వం ఇస్తున్న ఈ రాయితీ సామాన్య కుటుంబాలకు ఎంతగానో ఉపయోగకరంగా మారింది. దీంతో వేములవాడ మున్సిపాలిటీ పరిధిలో 75 గజాల లోపు నిర్మాణాలకు దాదాపు 60 వరకు అనుమతులు జారీ చేశారు. రూపాయి పన్ను కూడా ఇంటి పన్నులో వసూలు చేస్తున్నారు.
75 గజాల్లో ఇండ్లను విలాసవంతంగా నిర్మించుకునేందుకు యజమానులు ఇష్టపడుతున్నారు. ఎక్కువగా డూప్లెక్స్ నిర్మాణాలవైపు మొగ్గు చూపుతున్నారు. అందులో గ్రౌండ్‌ఫ్లోర్‌లో 10×12 బెడ్రూం, 6 x 8 కిచెన్, 6 x 4 వాష్‌రూం, 9 x 12 హాల్ ఉంటాయి. మొదటి అంతస్తులో 10 x 10 రెండు బెడ్రూంలు, 6 x 4 వాష్‌రూం, చిన్న హాల్ కూడా ఉంటున్నాయి. అలాగే 2 x 6 అడుగుల మేర మెట్లు కూడా వస్తున్నాయి. ఇలా 20 లక్షల నుంచి 25 లక్షల్లోపే నిర్మాణాలు పూర్తవుతున్నాయని చెబుతున్నారు. మరికొందరు గ్రౌండ్‌ఫ్లోర్‌లో కార్ పార్కింగ్‌కు స్థలాన్ని వదులుతూ మొదటి అంతస్తులో డబుల్ బెడ్రూం నిర్మాణాలను చేసుకున్నారు.