బుధవారం 08 ఏప్రిల్ 2020
Jayashankar - Jan 15, 2020 , 02:28:50

నేడు సంక్రాంతి

నేడు సంక్రాంతి
  • -వైభవంగా భోగి వేడుకలు
  • -ఆలయాల్లో ప్రత్యేక పూజలు
  • -సంప్రదాయం ఉట్టి పడేలా సంబురాలు
  • -గంగిరెద్దుల విన్యాసాలు.. హరిదాసు కీర్తనలు.. అలరించిన రంగవల్లులు -16లో

జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో ముంగిళ్లన్నీ సప్తవర్ణ శోభితమయ్యాయి. వాకిళ్లు హరివిల్లులతో మురిసిపోయాయి. ఆడబిడ్డల మునివేళ్ల నుంచి అందమైన రంగవల్లులు ఆవిషృతమయ్యాయి. ముగ్గులు, అందులో గొబ్బెమ్మలు, హరిదాసుల కీర్తనలు, డూడూ బసవన్నల ఆటలు, ఆకాశంలో పతంగులు, ఇంటినిండా బంధువులు, పిండివంటల ఘుమఘుమలు వెరసి.. మూడురోజుల పండుగను రెండు జిల్లాల ప్రజలు మంగళవారం ఘనంగా ప్రారంభించారు.

ములుగు, నమస్తే తెలంగాణ/ భూపాలపల్లి టౌన్‌, జనవరి 14 : దక్షిణాయనంలో ప్రజలు తాము పడిన కష్టాలను, బాధలను అగ్ని దేవుడికి ఆహుతి ఇస్తూ రాబోయే ఉత్తరాయణంలో సుఖః సంతోషాలను ప్రసాదించాలని కోరుతూ రెండు జిల్లాల్లో తెల్లవారుజామునే భోగి మంటలు వేశారు. పాత వస్తువులు, కట్టెలు సేకరించి ప్రధాన కూడళ్లలో మంటలు వేసుకొని చలికాగారు. అందరూ స్నానాలు చేసి, కొత్తబట్టలు ధరించి ఇళ్లను అందంగా అలంకరించారు. ఇళ్ల ముందర సంస్కృతీ సంప్రదాయాలు ఉట్టిపడేలా ముగ్గులను తీర్చిదిద్దారు. చుక్కల ముగ్గులు, ముత్యాల ముగ్గు, సూర్యరథం ముగ్గులు వేసి సం క్రాంతికి స్వాగతం పలికారు. ముగ్గుల మధ్యన గొబ్బెమ్మలు పెట్టి, అందులో రేగు పండ్లు, నవధాన్యాలు, గరిక పోసలతో అలంకరించారు. హరిదాసుల కీర్తనలు, గంగిరెద్దుల విన్యాసాలతో వీధులన్నీ మార్మోగాయి. పలు ప్రాంతాల్లో బొమ్మల కొలువులు ఏర్పాటు చేశారు. పిల్లలపై భోగి పళ్లు పోశారు. పిల్లలు గాలిపటాలు ఎగరేస్తూ సందడిగా గడిపారు. పిండివంటల ఘుమఘుమలతో, బంధూమిత్రులతో ఇళ్లు కళకళలాడాయి. పండుగ నేపథ్యంలో రెండు జిల్లాల్లోని ఆలయాల్లో అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. భూపాలపల్లిలో ఆయా కాలనీల ప్రజలు తమ ఇండ్ల ఎదుట టీఆర్‌ఎస్‌, కారు గుర్తు ముగ్గులు వేసుకోవడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సుభాశ్‌కాలనీ, హనుమాన్‌నగర్‌లో కాలనీవాసులు భోగి మం టలు వేశారు. మున్సిపల్‌ ఎన్నికలను పురస్కరించుకొని అభ్యర్థులు భోగి పండుగ రోజు సైతం టికెట్ల రందిలో పడ్డారు. కుటుంబ సభ్యులతో కలిసి పార్టీ కార్యాలయాల వద్దే పడిగాపులు కాశారు. అంబేద్కర్‌ సెంటర్‌, గణేశ్‌ సెంటర్‌లో రంగు లు, ఆవుపేడ, గరిక, పిండి ఆకుల విక్రయాలు కొనసాగాయి.

నేడు సంక్రాంతి పర్వదినం..

సూర్యుడు మకర రాశిలో ప్రవేశించే కాలమే మకర సంక్రమణం అంటారు. సకల సౌభాగ్యాలు ప్రసాదించే మహిమాన్వితమైన రోజునే సంక్రాంతిగా పిలుస్తారు. ప్రతి ఇంటిలో సిరులు నింపి సరికొత్త కాంతులు పంచే ఈ పర్వదినాన్ని ఆనందోత్సాహాలతో జరుపుకునేందుకు జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు జిల్లాల ప్రజలు సిద్ధమయ్యారు. సూర్య భగవానుడిని మకరరాశిలోకి ఆహ్వానిస్తూ వీధుల్లో బారులు తీరేలా రథం ముగ్గులు వేసేందుకు సర్వం సిద్ధం చేశారు. మొదటి రోజు మంగళవారం భోగిని ఘనంగా నిర్వహించగా, బుధవారం మకర సంక్రాంతి, గురువారం కనుమ పండుగను వైభవంగా నిర్వహించేందుకు ప్రజలు, రైతులు ఏర్పాట్లు చేసుకునారు. అమ్మనాన్నలు, అత్తామామలు, ఆడబిడ్డలు, అల్లుళ్లు, మనుమలు, మనమరాళ్లు, బంధువులతో ఇల్లిల్లూ కళకళలాడుతున్నది.

 రద్దీగా మారిన ఆలయాలు

ఉత్తరాయణ పుణ్యకాలంలో నదీస్నానాలు, సముద్ర స్నానాలు చేసి ఇష్ట దేవతలను దర్శించుకుంటారు. ఈ నేపథ్యంలో జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో పలు ఆలయాల్లో భక్తుల రద్దీ పెరిగింది.

గంగిరెద్దుల విన్యాసాలు

ఉత్తరాయన పుణ్యకాలంలో దేవతలు దివి నుంచి భువికి దిగివస్తాని ప్రజల నమ్మకం. దీంతో ఇళ్లను సర్వంగా సుందరంగా ముస్తాబు చేశారు. గంగిరెద్దులను శివుడి నంది స్వరూపంగా, హరిదాసును విష్ణు స్వరూపంగా భావించి వారికి ధాన్యాన్ని, ఇతర వస్తువులను దానంగా ఇచ్చారు.

కనుమ పండుగకు ఏర్పాట్లు

మకర సంక్రాంతి మరుసటి రోజును రైతు లు కనుమ పండుగ నిర్వహిస్తారు. పశువులను కడిగి పసుపు, కుంకుమ రాసి, రంగురంగుల తాళ్లతో అలంకరిస్తారు. కనుమ రోజున పితృదేవతలకు పూజలు చేస్తారు. కాగా సంక్రాంతి వే డుకలకు వారం ముందు నుంచే పిండి వం టలు తయారు చేయడంలో మహిళలు నిమగ్నమయ్యారు. కరకరలాడే సకినాలు, గారెలు, మడుగులు, అరిసెలు, మురుకులు, పూస, బోంది చేశారు.
logo