Donald Trump : అమెరికా అధ్యక్షుడు (US president) డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) తాను పాల్గొన్న ఒక ప్రచారం కార్యక్రమంపై అయిష్టత వ్యక్తంచేశారు. ఆ ప్రచారం చీప్‌గా అనిపిస్తోందని వ్యాఖ్యానించారు. ట్రంప్ వ్యాఖ్య ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ‘టిప్స్‌పై పన్ను రద్దు’ విధానం ప్రవేశపెట్టి ఏడాది పూర్తయిన సందర్భంగా నాడు ట్రంప్ తనదైన శైలిలో ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలో భాగంగా డోర్‌డాష్ డెలివరీ డ్రైవర్ ద్వారా వైట్‌హౌస్ (White House) లోని ఓవల్ ఆఫీస్‌కు మెక్‌డొనాల్డ్స్ బర్గర్ల (Mecdonalds Burgers) ను తెప్పించుకున్నారు.
అర్కాన్సాస్‌కు చెందిన రిపబ్లికన్ మద్దతుదారు షారన్ సిమన్స్ అనే డెలివరీ డ్రైవర్.. బర్గర్లు, ఫ్రెంచ్ ఫ్రైస్‌తో ఉన్న రెండు బ్యాగులను తీసుకురాగా ట్రంప్ స్వయంగా వాటిని అందుకున్నారు. ఈ పాలసీ వల్ల షారన్‌కు 11,000 డాలర్లు ఆదా అయ్యాయని వైట్‌హౌస్ వర్గాలు అప్పట్లో ప్రచారం చేశాయి. అయితే ఈ ఘటన జరిగిన కొద్ది రోజులకే లాస్ వెగాస్‌లో జరిగిన ఒక ర్యాలీలో ట్రంప్ మాట్లాడుతూ.. ఈ విషయంపై అయిష్టత వ్యక్తంచేశారు. రాజకీయాల్లో కొన్నిసార్లు ఇలాంటివి చేయాల్సి వస్తుందని, అవి కొంచెం ఇబ్బందికరంగా ఉంటాయని అన్నారు.
నిజం చెప్పాలంటే ఓవల్ ఆఫీస్‌కు మెక్‌డొనాల్డ్స్ బర్గర్లు డెలివరీ చేయించడం చీప్‌గా అనిపించిందని ట్రంప్ అన్నారు. తన 2024 ప్రచారంలో భాగంగా బర్గర్ షాపులో ఫ్రైస్ వడ్డించడం, సేఫ్టీ జాకెట్ వేసుకుని చెత్త ట్రక్కు ఎక్కడం వంటివి కూడా ఇలాంటి పిచ్చి ఆలోచనలే అని వ్యాఖ్యానించారు.