Volcano Eruption : ఐస్లాండ్ దేశంలో నైరుతి భాగంలో సోమవారం రాత్రి అగ్నిపర్వతం పేలుడు సంభవించింది. ఆ అగ్నిపర్వతం నుంచి పెద్ద ఎత్తున లావా ఉబికి వస్తున్నది. దాంతో పరిసర ప్రాంతాల్లో దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. ఐస్లాండ్ వాతావరణ విభాగం అధికారులు ఈ విషయాన్ని వెల్లడించారు. అగ్నిపర్వతానికి సమీపంలోని పట్టణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
భూమి కింది శిలలు ద్రవంగా మారడంతో ఐస్లాండ్లో కొన్ని వారాల క్రితం పలు భూకంపాలు సంభవించాయి. వాటి ప్రభావంతో ఇప్పుడు రెయిక్జాన్స్ ద్వీకల్పంలో అగ్నిపర్వతంలో పేలుడు జరిగింది. అగ్నిపర్వతం పేలుతుందన్న అంచనాల నేపథ్యంలో నెల క్రితమే సమీపంలోని నాలుగు వేల మందిని ఖాళీ చేయించారు.
ఐస్లాండ్ రాజధానికి దక్షిణంగా హగాఫెల్కు దగ్గరలో ఉన్న అగ్నిపర్వతం పేలిందని ఐస్లాండ్ అధికారులు తెలిపారు. కాగా, అగ్నిపర్వతం విస్ఫోటనం పరిమాణం, కచ్చితమైన ప్రదేశాన్ని నిర్ధారించడానికి కోస్ట్ గార్డ్ హెలికాప్టర్ బయలుదేరింది. ఇదిలావుంటే ఐస్లాండ్ దేశంలో మొత్తం 33 అగ్నిపర్వతాలున్నాయి. ఇవి తరచుగా పేలుతుండటంతో ఐస్లాండ్ ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.