వాషింగ్టన్ : నైతిక దుష్ప్రవర్తనకు పాల్పడిన చట్టబద్ధమైన శాశ్వత నివాసులు లేదా గ్రీన్‌కార్డు హోల్డర్లను దేశం నుంచి బహిష్కరించడాన్ని సరిహద్దు అధికారులకు సులభతరం చేస్తూ అమెరికా సుప్రీంకోర్టు మంగళవారం తీర్పు జారీచేసింది. తిరిగివస్తున్న గ్రీన్‌కార్డు హోల్డర్‌కు ప్రవేశాన్ని నిరాకరించే ముందు ఆ వ్యక్తి అనర్హతకు దారితీసే నేరం చేశాడని ఇమిగ్రేషన్ అధికారులు స్పష్టమైన, నమ్మదగిన సాక్ష్యంతో నిరూపించవలసిన అవసరం లేదని బ్లాంచె వర్సెస్ లాన్ కేసులో అమెరికా జస్టిస్ క్లారెన్స్ థామన్ రచించిన 6-3 తీర్పులో పేర్కొన్నారు.
దానికి బదులుగా అటువంటి నేరం జరిగి ఉండవచ్చని నమ్మడానికి తగిన కారణం ఉందని అధికారులు నిరూపిస్తే సరిపోతుందని తీర్పులో న్యాయమూర్తులు స్పష్టంచేశారు. ఇమిగ్రేషన్, నేషనాలిటీ చట్టం అటువంటి నిబంధనను విధించబోదని జస్టిస్ థామస్ తన తీర్పులో పేర్కొన్నారు. ఈ నిర్ణయం నైతిక దుష్ప్రవర్తనకు సంబంధించిన నేరాల్లో ప్రమేయం ఉన్నట్లు అనుమానం ఉంటే అమెరికా ప్రవేశ ద్వారాల వద్దకు వచ్చే చట్టబద్ధమైన శాశ్వత నివాసితుల ప్రవేశాన్ని నిరాకరించడానికి, వారిని దేశం నుండి బహిష్కరించే చర్యలను ప్రారంభించడానికి సరిహద్దు ఏజెంట్ల అధికారాలను సమర్థవంతంగా బలపరుస్తుంది.