కీవ్: ఉక్రెయిన్(Ukraine) రక్షణ మంత్రి అలెక్సీ రెజ్నికోవ్పై వేటు పడింది. ఆయన్ను ఆ పదవి నుంచి తొలగిస్తూ జెలెన్స్కీ ఆదేశాలు జారీ చేశారు. ఆ పోస్టు నుంచి తప్పుకుంటున్నట్లు కూడా రెజ్నికోవ్ ద్రువీకరించారు. గత ఏడాది ఫిబ్రవరిలో రష్యా దాడి చేయడానికి ముందు నుంచే ఉక్రెయిన్ రక్షణమంత్రిగా రెజ్నికోవ్ ఉన్నారు. రెజ్నికోవ్ను తొలగిస్తూ ఆదివారం జెలెన్స్కీ ఆ ప్రకటన చేశారు. రక్షణ మంత్రిత్వ కార్యాలయంలో కొత్త విధానాలను అమలు చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. రెజ్నికోవ్ స్థానంలో రుస్తెమ్ ఉమెరోవ్‌ను నియమిస్తున్నట్లు జెలెన్స్కీ పేర్కొన్నారు. దేశ పార్లమెంట్‌కు తన రాజీనామా లేఖను సమర్పించినట్లు రెజ్నికోవ్ తెలిపారు. రష్యాతో యుద్ధం ప్రారంభమైన తర్వాత ఇప్పటి వరకు ఉక్రెయిన్‌కు సుమారు వంద బిలియన్ల డాలర్ల ఆయుధ సాయాన్ని పశ్చిమ దేశాలు అందించినట్లు రెజ్నికోవ్ తెలిపారు. దాంట్లో ఒక్క అమెరికానే 50 బిలియన్ల డాలర్ల ఖరీదైన ఆయుధాల్ని అందించింది.