వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో రాష్ట్రం పేరును మార్చే దిశగా దృష్టి సారించారు. న్యూ మెక్సికో పేరును ‘న్యూ అమెరికా’గా మార్చవచ్చని ఆదివారం సూచించారు. అయితే ట్రంప్ ప్రతిపాదనను ఆ రాష్ట్ర గవర్నర్ తిరస్కరించారు. పొరుగు దేశం కెనడాతో వాణిజ్య యుద్ధం కొనసాగుతున్న తరుణంలో ఒంటారియో సరస్సు పేరును ‘లేక్ అమెరికా’గా మారుస్తూ ట్రంప్ ఆదేశాలు జారీ చేసిన కొద్ది రోజులకే ఈ ప్రతిపాదన రావడం గమనార్హం.
‘న్యూ మెక్సికో పేరును న్యూ అమెరికాగా మార్చాలని పలువురు సూచించారు’ అని రిపబ్లికన్ పార్టీకి చెందిన అధ్యక్షుడు ట్రంప్ సామాజిక మాధ్యమంలో పోస్ట్ చేశారు. ‘అద్భుతమైన సామర్థ్యం ఉన్న ఆ రాష్ట్ర ప్రజలకు ఇది మరింత ప్రతిష్టాత్మకంగా ఉంటుంది. ఇది నాకు చాలా ఇష్టం’ అని ట్రంప్ పేర్కొన్నారు. కాగా న్యూ మెక్సికో గవర్నర్ మిషెల్ లుహాన్ గ్రిషమ్ ‘ఫాక్స్’ న్యూస్‌తో మాట్లాడుతూ రాష్ట్రం పేరును మార్చే అంశంపై చర్చే లేదని స్పష్టం చేశారు.