ట్రంప్‌కు అమెరికా ఓటర్ల షాక్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు ఓటర్లు గట్టి షాక్ ఇచ్చారు. మధ్యంతర ఎన్నికల్లో ప్రతిపక్ష డెమోక్రటిక్ పార్టీ అమెరికా కాంగ్రెస్‌లోని ఉభయ సభలపై పట్టు సాధించింది. కీలక రాష్ర్టాల్లో గవర్నర్ పదవులనూ కైవసం చేసుకుంది. ఈ ఫలితాలు అమెరికా రాజకీయాలపైనే కాకుండా అంతర్జాతీయ పరిణామాలపైనా ప్రభావం చూపనున్నాయి.
- మధ్యంతర ఎన్నికల్లో రిపబ్లికన్లకు పరాభవం
- పట్టున్న రాష్ర్టాల్లోనూ ఘోర పరాజయం
- కాంగ్రెస్ ఉభయ సభలూ డెమోక్రాట్ల వశం
- ఎన్నికల్లో సత్తా చాటిన ఇండియన్ అమెరికన్లు
వాషింగ్టన్, నవంబర్ 4: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు ఓటర్లు గట్టి షాక్ ఇచ్చారు. మధ్యంతర ఎన్నికల్లో ప్రతిపక్ష డెమోక్రటిక్ పార్టీ అమెరికా కాంగ్రెస్‌లోని ఉభయ సభలపై పట్టు సాధించింది. కీలక రాష్ర్టాల్లో గవర్నర్ పదవులనూ కైవసం చేసుకుంది. ఈ ఫలితాలు అమెరికా రాజకీయాలపైనే కాకుండా అంతర్జాతీయ పరిణామాలపైనా ప్రభావం చూపనున్నాయి. ట్రంప్ సొంత పార్టీ అయిన రిపబ్లికన్లు తమకు బలమైన పట్టున్న టెక్సాస్, జార్జియా, ఐయోవా, ఓహియో రాష్ర్టాల్లో గవర్నర్ పదవులను కోల్పోయారు. సెనెట్ ఎన్నికల్లోనూ టెక్సాస్, మైనే, సౌత్ కరోలినా, నార్త్ కరోలినా, కాన్సాస్, ఐయోవా, ఓహియో రాష్ర్టాల్లో ఓటమిని చవిచూశారు.
ఎన్నికల ప్రచారంలో ట్రంప్ స్వయంగా పాల్గొని, బ్యాలెట్‌పై తన పేరు ఉన్నట్లు భావించి ఓటేయాలని మద్దతుదారులకు పిలుపునిచ్చినా ఫలితం లేకుండా పోయింది. సెనెట్‌లో ఇంతకుముందు రిపబ్లికన్లకు 53-47 మెజారిటీ ఉండేది. వారి ఆధీనంలో ఉన్న కనీసం ఏడు స్థానాలను డెమోక్రాట్లు గెలుచుకోవడంతో సెనెట్‌పై పట్టు మారింది. ప్రతినిధుల సభలోనూ గతంలో రిపబ్లికన్లకు 220-215తో స్వల్ప ఆధిక్యం ఉండేది. మెజారిటీకి అవసరమైన 218 స్థానాలను డెమోక్రాట్లు దాటి తమ ఆధీనంలోకి తెచ్చుకున్నారు. ట్రంప్ 2024లో రెండంకెల ఆధిక్యంతో గెలిచిన పలు నియోజకవర్గాల్లోనూ డెమోక్రాట్లు విజయం సాధించారు. ప్రతినిధుల సభలో రెండు డజన్లకుపైగా స్థానాలను తమ ఖాతాలో వేసుకున్నారు.
ట్రంప్ శకం ముగిసింది..
ట్రంప్ విధానాలపై ప్రజల్లో పెరిగిన అసంతృప్తే ఈ ఓటములకు కారణమని విశ్లేషణలు వెలువడుతున్నాయి. ఇరాన్‌తో యుద్ధం, పెరుగుతున్న జీవన వ్యయం వంటి అంశాలు ఓటర్లను ప్రభావితం చేశాయి. పోలింగ్ కేంద్రాల వద్ద పీటీఐతో మాట్లాడిన పలువురు ఓటర్లు ట్రంప్ అబద్ధాలు, గొప్పలు చెప్పుకునే ధోరణి పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. జార్జియాలో ఓ డెమోక్రటిక్ ఓటరు మాట్లాడుతూ.. ట్రంప్‌ను తన పిల్లలకు ఆదర్శంగా చూపించలేనని, ఆయన పదవి నుంచి వీలైనంత త్వరగా వైదొలగాలని కోరుకుంటున్నానని చెప్పారు. ట్రంప్ మద్దతుతో ఓహియో గవర్నర్ పదవికి పోటీచేసిన భారత సంతతి అమెరికన్ వివేక్ రామస్వామి ఓటమి పాలయ్యారు. డెమోక్రటిక్ అభ్యర్థి అమీ ఆక్టస్ ఆయనపై విజయం సాధించారు. ఈ ఎన్నికల ప్రచారంలో రిపబ్లికన్ పార్టీలోనూ విభేదాలు తలెత్తాయి. ఎన్నికల ఫలితాలపై స్పందించిన రిపబ్లికన్ పార్టీ నేత క్రిస్ క్రిస్టీ.. ట్రంప్ శకం ముగిసింది అని వ్యాఖ్యానించారు.

Us Results
బ్యాలెట్‌పై నా పేరు లేనందునే..: ట్రంప్
ఓటమిని అంగీకరించిన ట్రంప్.. డెమోక్రాట్లకు అభినందనలు తెలిపారు. దేశ ప్రయోజనాల కోసం వారితో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నానని సీబీఎస్ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. ఫలితాలను పూర్తిగా అంగీకరిస్తున్నానని న్యూయార్క్ టైమ్స్‌కు వెల్లడించారు. అయితే తనదైన శైలిలో ఓటమికి కారణాలను ఇతరులపైకి నెట్టారు. బ్యాలెట్‌పై తన పేరు లేకపోవడం వల్లే పార్టీ ఓడిపోయిందని వ్యాఖ్యానించారు. తాను పోటీలో ఉండి ఉంటే భారీ మెజారిటీతో గెలిచేవాళ్లమని ట్రూత్ సోషల్‌లో పోస్టు చేశారు. దక్షిణ కరోలినా సెనెటర్ డార్లిన్ గ్రాహమ్, టెక్సాస్ అటార్నీ జనరల్ కెన్ పాక్ట్సస్లకు మద్దతు తెలిపినందుకు ఎలాంటి విచారం లేదన్నారు.
కంచుకోటలు బద్ధలు
కాన్సాస్‌లో రిపబ్లికన్ల కంచుకోట బద్ధలైంది. ఇక్కడ పాస్టర్, రాజకీయ నాయకుడు ఆడమ్ హామిల్టన్ విజయం సాధించడంతో దాదాపు వందేండ్ల తర్వాత ఆ రాష్ట్ర సెనెట్ స్థానాన్ని డెమోక్రాట్లు గెలుచుకున్నట్టయింది. టెక్సాస్‌లో డెమోక్రటిక్ అభ్యర్థి జేమ్స్ తలారికో.. రిపబ్లికన్ కెన్ పాక్ట్స్స్ను ఓడించారు. దాదాపు 40 ఏండ్ల తర్వాత ఆ రాష్ట్రం నుంచి డెమోక్రటిక్ పార్టీకి చెందిన వ్యక్తి సెనెట్‌కు ఎన్నికయ్యారు. నార్త్ కరోలినాలో రాయ్ కూపర్.. రిపబ్లికన్ మైకెల్ వాట్లీపై విజయం సాధించారు. జార్జియాలో కీషా లాన్స్ బాటమ్స్ గవర్నర్‌గా ఎన్నికై ఆ రాష్ట్ర తొలి నల్లజాతి మహిళా గవర్నర్‌గా చరిత్ర సృష్టించారు.
ఐయోవాలో డెమోక్రటిక్ అభ్యర్థి రాబ్ శాండ్ గవర్నర్ పదవిని దక్కించుకున్నారు. టెక్సాస్‌లో గినా హినోజోసా.. ప్రస్తుత గవర్నర్ గ్రెగ్ అబాట్‌ను ఓడించి, ఆ రాష్ట్ర గవర్నర్‌గా ఎన్నికైన తొలి లాటినా మహిళగా నిలిచారు. ఓహియోలో ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన జేడీ వాన్స్ స్థానంలో సెనెట్‌కు నియమితులైన రిపబ్లికన్ జాన్ హస్టెడ్.. డెమోక్రటిక్ అభ్యర్థి షెర్రాడ్ బ్రౌన్ చేతిలో ఓడిపోయారు. జార్జియాలో డెమోక్రటిక్ సెనెటర్ జాన్ ఒసాఫ్ తిరిగి ఎన్నికయ్యారు. 2028 అధ్యక్ష ఎన్నికల్లో ఆయన పోటీచేసే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతున్నది.
ట్రంప్ నిర్ణయాలకు బ్రేకులు
కాంగ్రెస్‌పై డెమోక్రాట్లకు పట్టు లభించడంతో ట్రంప్ తన ఇష్టానుసారం పాలన సాగించే అవకాశాలు తగ్గనున్నాయి. అధ్యక్షుడి విధానాలను అడ్డుకునే అధికారం కాంగ్రెస్‌కు ఉంది. ఇక తన పదవీకాలంలో ట్రంప్ కార్యనిర్వాహక ఉత్తర్వుల ద్వారా నిర్ణయాలు తీసుకోవచ్చు లేదా కాంగ్రెస్ ఆమోదించే బిల్లులపై వీటో ప్రయోగించవచ్చు. ఫలితాలు వెలువడుతున్న సమయంలో ట్రంప్ తన ట్రూత్ సోషల్ ఖాతాలో వీటో అని రాసి ఉన్న ఎరుపురంగు టోపీ చిత్రాన్ని పోస్ట్ చేశారు.
తొలి ముస్లిం సెనెటర్

Sayyad
మధ్యంతర ఎన్నికల్లో మరో రికార్డు నమోదైంది. మిషిగన్ రాష్ట్రంలో సెనెట్ స్థానం కోసం జరిగిన హోరాహోరీ పోరులో డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి అబ్దుల్ ఎల్ సయ్యద్ విజయం సాధించారు. అమెరికా చరిత్రలోనే మొట్టమొదటి ముస్లిం సెనెటర్‌గా నిలిచి ఆయన చరిత్ర సృష్టించారు. రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి మైక్ రోజర్స్‌ను ఆయన ఓడించారు. కాగా, సయ్యద్ భార్య కర్ణాటక మూలాలున్న వారు కావడం విశేషం.
ఇండియన్ అమెరికన్ల సత్తా

Indian Americans Win
అమెరికా మధ్యంతర ఎన్నికల్లో భారత సంతతి వ్యక్తులు సత్తా చాటారు. డెమోక్రాటిక్ పార్టీ నుంచి పోటీ చేసి కీలక విజయాలు సాధించారు. వీరిలో అమీబెరా, రో ఖన్నా, సుహాస్ సుబ్రహ్మణ్యం, ప్రమీలా జయపాల్ ప్రతినిధుల సభకు తిరిగి ఎన్నికయ్యారు. మేరీల్యాండ్ లెఫ్ట్‌నెంట్ గవర్నర్‌గా అరుణా మిల్లర్ మరోసారి ఎన్నికయ్యారు. దీంతో ప్రతినిధుల సభలో ఇండో అమెరికన్ల సంఖ్య మరింత పెరిగింది. కాలిఫోర్నియాలోని సిలికాన్ వ్యాలీ పరిధిలో 17వ నియోజకవర్గం నుంచి రో ఖన్నా తిరిగి ఎన్నికయ్యారు. వర్జీనియాలోని 10వ నియోజకవర్గం నుంచి సుహాస్ సుబ్రహ్మణ్యం రిపబ్లికన్ అభ్యర్థి డేవ్ బెక్వెత్పై విజయం సాధించారు.
కాలిఫోర్నియాలోని మూడో కాంగ్రెస్ నియోజకవర్గం నుంచి అమీ బెరా రిపబ్లికన్ అభ్యర్థి రాబ్ టక్కర్‌పై గెలిచి ఎనిమిదోసారి ప్రతినిధుల సభకు ఎన్నికయ్యారు. వాషింగ్టన్ రాష్ట్రం ఏడో నియోజకవర్గం నుంచి ప్రమీలా జయపాల్ ఆరోసారి ప్రతినిధుల సభకు ఎన్నికయ్యారు. ఫ్లోరిడాలోని 22వ కాంగ్రెస్ నియోజకవర్గం నుంచి డెమోక్రాటిక్ అభ్యర్థి షియా దాండియా రిపబ్లికన్ అభ్యర్థి కేసీ అస్కర్‌ను ఓడించారు. మేరీల్యాండ్ లెఫ్ట్‌నెంట్ గవర్నర్‌గా డెమోక్రాటిక్ పార్టీకి చెందిన అరుణా మిల్లర్ మరోసారి ఎన్నికయ్యారు. ఆంధ్రప్రదేశ్‌లో జన్మించిన ఆమె ఏడేండ్ల వయసులోనే అమెరికాకు వలస వెళ్లారు.
ఓడిన వివేక్ రామస్వామి
ఒహాయో గవర్నర్‌గా పోటీ చేసిన రిపబ్లికన్ అభ్యర్థి వివేక్ రామస్వామి ఓటమిపాలయ్యారు. భారత సంతతికి చెందిన వివేక్‌కు అధ్యక్షుడు ట్రంప్ మద్దతు ప్రకటించారు. నార్త్ కరోలినాలోని నాలుగో కాంగ్రెస్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన రిపబ్లికన్ అభ్యర్థి మహేశ్ గణోర్కర్ కూడా ఓటమి చెందారు.అరిజోనాలోని మొదటి కాంగ్రెస్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన డెమోక్రాటిక్ అభ్యర్థి అమిష్ షా, లాస్ ఏంజెలెస్ మేయర్ పదవికి పోటీ చేసిన నిత్యారామన్, టెక్సాస్ రాష్ట్ర శాసనసభకు పోటీ చేసిన పూజా సేథీ, సందీప్ శ్రీవాస్తవ తదితర భారతీయ అమెరికన్ల గెలుపోటముల వివరాలు వెల్లడి కావాల్సి ఉంది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

