హవాయి: అమెరికాలోని హవాయిలోగల ఓ చెరువులో నీళ్లు ఒక్కసారిగా గులాబీ రంగులోకి మారిపోయాయి. దాంతో అంతా ఆశ్చర్యపోతున్నారు. గత రెండు వారాలుగా ఆ చెరువులో నీళ్లు అలాగే కనిపిస్తున్నాయని స్థానికులు చెబుతున్నారు. కాగా, చెరువులో నీళ్లు అకస్మాత్తుగా గులాబీ రంగులోకి ఎందుకు మారాయి అనే దానిపై అధ్యయనం చేస్తున్నామని అమెరికాకు చెందిన ‘ఫిష్ అండ్ వైల్డ్‌లైఫ్ సర్వీస్’ తెలిపింది.
అధిక లవణీయత ఉన్న నీటిలో కనిపించే బాక్టీరియా కారణంగా నీళ్లు గులాబీ రంగులోకి మారిపోయి ఉంటాయని అధికారులు భావిస్తున్నారు. కరవు కారణంగా జూన్ నుంచి చెరువులో నీరు ఆవిరి కావడంవల్ల లవణీయత పెరిగిందని చెబుతున్నారు. నీరు విషపూరితం కాలేదని, రంగు మార్పుపై స్పష్టత కోసం నమూనాలు సేకరించి హవాయీ విశ్వవిద్యాలయానికి పంపించామని తెలిపారు.
కాగా, ఉన్నట్టుండి చెరువులోని నీళ్లు గులాబీ రంగులో మారడంతో ఆశ్చర్చపోయిన ఓ వ్యక్తి.. డ్రోన్ సాయంతో వీడియో తీశాడు. ఆ తర్వాత ఆ దృశ్యాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఆ దృశ్యాలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. దాంతో చెరువును చూసేందుకు అనేక మంది తరలి వెళ్తున్నారు.