ఉక్రెయిన్‌పై దాడులు చేయడానికి రష్యా సర్వసన్నద్ధమైంది. సేనలను కూడా మోహరించింది. ఓ వైపు అమెరికా హెచ్చరిస్తున్నా… ఈ నెల 16న ఉక్రెయిన్‌పై దాడులు చేసేందుకు రష్యా ప్లాన్ వేసిందని రిపోర్టులు కూడా వచ్చాయి. ఏం జరుగుతుందో అని ప్రపంచం మొత్తం ఎదురు చూస్తున్న వేళ… ఉక్రెయిన్ సరిహద్దుల నుంచి రష్యా కొన్ని బలగాలను ఉపసంహరించుకున్నట్లు కీలక ప్రకటన చేసింది. కొన్ని దళాలను బేస్ క్యాంపులకు తరలించినట్లు రష్యా పేర్కొంది. దీని కంటే ముందే అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ రష్యా అధ్యక్షుడు పుతిన్ మధ్య గంట పాటు ఫోన్ చర్చలు జరిగాయి. ఈ సందర్భంగా జోబైడెన్… పుతిన్‌ను తీవ్రంగా హెచ్చరించినట్లు వార్తలు కూడా వచ్చాయి.
ఉక్రెయిన్‌పై దాడికి దిగితే మాత్రం ఎన్నడూ ఊహించనంత ఆంక్షలు విధిస్తామని, వీటన్నింటినీ బేరీజు వేసుకునే తదుపరి చర్యలు తీసుకోవాలని జోబైడెన్ పుతిన్‌ను తీవ్రంగా హెచ్చరించారు. అయితే ఇదొక్కటే బయటికి వచ్చింది. మరో విషయాన్ని చూపుతూ.. జోబైడెన్ రష్యా అధ్యక్షుడు పుతిన్‌ను హెచ్చరించినట్లు తెలుస్తోంది. అదే రష్యా నుంచి జర్మనీ వరకూ వెళ్లే పైపులైన్ ( నార్డ్ స్ట్రీమ్ -2 పైపులైన్) గురించి. దీనిని పూర్తిగా నిలిపేస్తామని జోబైడెన్ పుతిన్‌ను హెచ్చరించినట్లు సమాచారం. ఈ ఒక్క కారణంతోనే రష్యా ప్రస్తుతానికి వెనకడుగు వేసిందని అంతర్జాతీయ సమాజం బలంగా విశ్వసిస్తోంది. అయితే.. ఆ ఒక్క దాని గురించి రష్యా అంతలా భయపడిందా? అసలేంటి నార్డ్ స్ట్రీమ్-2? దాని వల్ల రష్యాకు అంతలా ప్రయోజనాలు ఏమున్నాయి.. ? జర్మనీకి దానికి సంబంధాలేంటి ? అనే విషయాలను ఓ సారి పరిశీలిస్తే..
అసలేంటి నార్డ్ స్ట్రీమ్-2?
నార్డ్ స్ట్రీమ్ పైప్ లైన్ 1200 కిలోమీటర్ల పొడవైన పైప్‌లైన్. పశ్చిమ రష్యా నుంచి ఈశాన్య జర్మనీకి బాల్టిక్ సముద్రం ద్వారా వెళ్లే పైప్‌లైన్. 83 వేల కోట్ల రూపాయల ప్రాజెక్టు ఇది. అయితే 2021 లోనే పూర్తైనట్లు సమాచారం. కొన్ని అత్యావశ్యకమైన అనుమతులు రావాల్సి వుంది. ఇది ఇంకా ప్రారంభం కాలేదు. దీని ద్వారా జర్మనీకి 55 బిలియన్ క్యూబిక్ మీటర్ల గ్యాస్ సరఫరా అవుతుంది. జర్మనీలోని 2.6 కోట్ల గృహాలకు చల్లటి వాతావరణం ఉన్నా… గ్యాస్ సరఫరా అవుతుంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి హక్కులు రష్యా ప్రభుత్వానివే. ప్రస్తుతమున్న పైప్‌లైన్ ప్రకారం రష్యా సంవత్సరంలో 55 బిలియన్ క్యూబిక్ గ్యాస్‌ను మాత్రమే సరఫరా చేస్తుంది. ఒకవేళ కొత్త పైప్‌లైన్ ప్రారంభమైతే.. దీన్ని మరింత రెట్టింపు చేయవచ్చు.
ఈ ప్రాజెక్టు ప్రారంభమైతే.. పుతిన్ సక్సెస్?
నార్డ్ స్ట్రీమ్-2 పైప్‌లైన్ ప్రారంభమైతే… దౌత్యపరంగా రష్యా అధ్యక్షుడు పుతిన్ పూర్తిగా సక్సెస్ అయినట్లేనని రష్యా అధికార వర్గాలు అంచనా వేస్తున్నాయి. జర్మనీకి ఉపయోగపడే ఇంధన అవసరాల్లో 40 శాతం రష్యా తీరుస్తూ వస్తోంది. ఈ పైప్‌లైన్‌తో మరింత సరఫరా సాధ్యమవుతుంది. దీని ద్వారా జర్మనీ తన అవసరాల నిమిత్తం పూర్తిగా రష్యాపైనే ఆధారపడే అవకాశాలున్నాయి. రష్యా వెనక్కి తగ్గకుంటే మాత్రం జర్మనీకి కూడా ఇబ్బుందులు తలెత్తే అవకాశం ఉంది.
ఆర్థిక చట్రంలో ఇరికించాలని అమెరికా ప్లాన్…
ఇంతటి ఆర్థిక విధి విధానాలతో ముడిపడి వున్న నార్డ్ స్ట్రీమ్ పైప్‌లైన్ నిలిపేస్తామని అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ రష్యా అధ్యక్షుడు పుతిన్‌ని హెచ్చరించారు. ఒకవేళ రష్యా గనక ఉక్రెయిన్‌పై దాడులకు దిగితే.. ఈ పైప్‌లైన్ పనులను ఆపేయడానికి ఆయా సంస్థలపై ఆర్థిక ఆంక్షలు విధించాలని అమెరికా రెడీ అయిపోయింది. పైప్‌లైన్ వ్యవహారాలు చూసే కంపెనీలు, వ్యక్తులపై ఆంక్షలు విధించే అవకాశాలున్నాయి. ఇలా చేస్తే.. ఈ పైప్‌లైన్ ఆగిపోయే అవకాశాలు పుష్కలంగానే వున్నాయి. అయితే ఈ ప్రాజెక్టుపై అమెరికా 2017,19, 2020 సంవత్సరాల్లో కొన్ని ఆంక్షలు విధించింది. మాజీ ప్రెసిడెంట్ ట్రంప్ కూడా ఈ ప్రాజెక్టుపై కొన్ని ఆంక్షలు విధించారు. వీటన్నింటినీ పుతిన్ పరిగణనలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.
గ్యాస్ పైప్‌లైన్ ఆగితే.. రష్యాకు ఇబ్బందులే..
ఒకవేళ అమెరికా ఈ ప్రాజెక్టును అడ్డుకుంటే రష్యా ఆర్థిక మూలాలు తీవ్ర స్థాయిలో దెబ్బతింటాయని పుతిన్‌కు గుబులు పుట్టింని తెలుస్తోంది. ఆర్థిక వ్యవస్థ మూలాలు పరిపుష్టంగా ఉంచుకోవడానికి గ్యాస్ సప్లైని జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఏమాత్రం దుందుడుకుగా ముందుకు వెళ్లినా.. ఆర్థికంగా బాగా నష్టపోయే అవకాశాలున్నాయి. దీంతో ఉక్రెయిన్‌కే లాభించే సూచనలు ఉన్నాయి. ఈ కారణంగానే రష్యా… తన బలగాలను ఉపసంహరించుకుందన్న కథనాలు చక్కర్లు కొడుతున్నాయి.