Eileen Wang : అమెరికా (USA) దేశం కాలిఫోర్నియా (California) రాష్ట్రంలోని ఆర్కడియా కౌంటీ (Arcadia County) మేయర్ ఐలీన్ వాంగ్ (Eileen Wang) పై ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (FBI) సంచలన ఆరోపణలు చేసింది. వాంగ్.. చైనా (China) కు చట్టవిరుద్ధమైన ఏజెంట్గా వ్యవహరించినట్లు అభియోగాలు మోపింది. యాభై ఎనిమిదేళ్ల ఐలీన్ వాంగ్ 2022లో ఆర్కడియా కౌంటీకి మేయర్గా ఎన్నికయ్యారు. ఆ ఎన్నికకు ముందు పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా (PRC) కు ఆమె అక్రమ ఏజెంట్గా వ్యవహరించారని ఎఫ్బీఐ అభియోగాలు మోపింది.
చైనీస్ అమెరికన్ల కోసం ‘యూఎస్ న్యూస్ సెంటర్’ అనే ఓ వార్తా వెబ్సైట్ను ఆమె నడిపినట్లు ఎఫ్బీఐ వెల్లడించింది. అందులో చైనాకు అనుకూలంగా ఎక్కువగా ప్రచారాలు చేసినట్లు తెలిపింది. 2020-2022 మధ్య ఈ వెబ్సైట్ పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనాకు అనుకూలంగా విస్తృతంగా ప్రచారం చేయడంతోపాటు దాని ప్రయోజనాల కోసం పని చేసినట్లు తెలిపింది. చైనా ప్రభుత్వ అధికారులకు అనుకూలంగా అక్కడి ప్రభుత్వం ఇచ్చే ఆదేశాలను ఐలీన్ ఇక్కడ అమలుచేసినట్లు వెల్లడించింది.
ఈ అభియోగాలపై సోమవారం విచారణ జరుగగా.. చైనా ప్రభుత్వ అధికారుల ఆదేశాల మేరకు ఓ వార్తా వెబ్సైట్ను నడిపినట్లు ఐలీన్ అంగీకరించారు. ఈ క్రమంలోనే మేయర్ పదవికి రాజీనామా చేశారు. ఈ అభియోగాలు రుజువైతే ఐలీన్కు దాదాపు పదేళ్ల వరకు జైలుశిక్ష పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది.