Pakistan : అమెరికా–ఇరాన్ మధ్య చర్చలకు మధ్యవర్తిత్వం వహిస్తున్న పాకిస్తాన్.. అమెరికాకు వెన్నుపోటు పొడుస్తుందా..? తాజా పరిణామాలు చూస్తుంటే ఔననే అనిపిస్తోందని అమెరికా నిపుణులు అంటున్నారు. ఇరాన్ రవాణాకు అనుకూలంగా ఆరు మార్గాల్ని పాక్ ప్రతిపదించినట్లు సమాచారం. ఒకపక్క హార్ముజ్ జలసంధిని దిగ్బంధించడం ద్వారా ఇరాన్‌పై ఒత్తిడి తేవాలని అమెరికా భావిస్తుంటే.. పాకిస్తాన్ మాత్రం ఇరాన్‌కు సాయం అందిస్తోందని అమెరికాకు చెందిన రక్షణ శాఖ నిపుణుడు డెరెక్ జె గ్రాస్మాన్ తెలిపారు.
ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా సంచలన విషయాలు వెల్లడించారు. డెరెక్ తెలిపిన వివరాల ప్రకారం.. హార్ముజ్ జలసంధిని అమెరికా దిగ్బంధించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఇరాన్ పోర్టుల్ని కూడా అమెరికా దిగ్బంధంలోకి తీసుకుంటోంది. దీని ద్వారా ఇరాన్ వాణిజ్యాన్ని అడ్డుకుని, ఆర్థికంగా దెబ్బతీయాలనేది అమెరికా ప్లాన్. ఇలా చేస్తే, ఇరాన్ దిగొచ్చి తమతో అణు ఒప్పందం చేసుకుంటుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇరాన్ నుంచి ఇతర దేశాలకు వాణిజ్యం చాలా వరకు ఆగిపోయింది. కానీ, ఈ విషయంలో ఇరాన్‌కు పాకిస్తాన్ సాయం చేస్తోంది. ఇరాన్ వాణిజ్యం చేసుకునేలా తమ దేశం నుంచి ఆరు ప్రత్యేక భూ మార్గాల్ని పాకిస్తాన్ ప్రతిపాదించింది.
హార్ముజ్ జలసంధితో సంబంధం లేకుండా, అమెరికా దళాలకు దొరక్కుండా ఈ రూట్లో ఇరాన్ వాణిజ్యం చేయొచ్చు. ఈ మార్గాల ద్వారా రష్యా, చైనా సహా ఇతర దేశాలకు ఇరాన్ చమురు, ఇతర ఉత్పత్తులు ఎగుమతి, దిగుమతులు చేసేందుకు పాకిస్తాన్ సహకరిస్తోంది. ఇప్పటికే మూడు వేల వరకు ట్రక్కులు ఈ రూట్లలో సరుకు రవాణా చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. అంటే, ఈ మార్గాల్లో ఇరాన్ వాణిజ్యం మొదలుపెడితే ఆ దేశానికి ఆర్థికంగా పెద్దగా నష్టం ఉండదు. ఇరాన్‌ను ఆర్థికంగా దెబ్బతీయాలనే అమెరికా లక్ష్యం నెరవేరదు.
ఇది అమెరికాకు ఒక రకంగా పాకిస్తాన్ వెన్నుపోటు పొడవడమే. ఇరాన్–అమెరికా చర్చల అంశంలో మధ్యవర్తిత్వం వహించే సత్తా పాకిస్తాన్‌కు లేదనేది చాలా మంది ఎప్పటినుంచో అభిప్రాయపడుతున్నారు. అటు ఇరాన్, ఇటు ఇజ్రాయెల్ కూడా ఈ విషయంలో పాకిస్తాన్‌పై అనుమానంగానే ఉన్నాయి. పాకిస్తాన్.. ఇరాన్‌కు అనుకూలంగా ఉంటుందని ఇజ్రాయెల్ ఆరోపించింది. తమతో స్నేహంగా ఉంటూనే అమెరికా కోసం పని చేస్తోందని ఇరాన్ ఆరోపించింది. ఈ ఆరోపణలు నిజమని తాజాగా పాకిస్తాన్ తీసుకున్న నిర్ణయంతో రుజువయ్యింది.