న్యూయార్క్: భూమిపైనే కాదు భూమి లోపల కూడా భారీ పర్వతాలు ఉన్నట్టు అమెరికాలోని అరిజోనా స్టేట్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు గుర్తించారు. భూమిపైనే ఎత్తైన పర్వతంగా ఉన్న మౌంట్ ఎవరెస్ట్ కంటే భూమి లోతుల్లో ఉన్న పర్వతాలు మూడు నాలుగు రెట్లు ఎత్తైనవని వారు చెబుతున్నారు.
మౌంట్ ఎవరెస్ట్ 8.8 కిలోమీటర్ల ఎత్తులో ఉండగా భూమి లోపల ఉన్న ఈ పర్వతాలు ఏకంగా 38 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉన్నాయని తెలిపారు. భూమి లోపల 2,900 కిలోమీటర్ల లోతులో ఈ పర్వతాలు ఉన్నట్టు తెలిపారు. వీటిని అల్ట్రా-లో వెలాసిటీ జోన్స్(యూఎల్వీజెడ్)గా పిలుస్తున్నారు. అంటార్కిటికాలోని భూకంప అధ్యయన కేంద్రాల నుంచి వెలువడిన సమాచారం ఆధారంగా ఈ పర్వతాలను గుర్తించినట్టు పరిశోధకులు పేర్కొన్నారు.