జీన్ ఎడిటింగ్ టెక్నాలజీతో అభివృద్ధి
క్యాన్సర్ వంటి వ్యాధులూ నయం
ప్రయోగ దశలో సత్ఫలితాలు
ఇజ్రాయెల్ పరిశోధకుల వెల్లడి
గత నలభై ఏండ్లుగా కోట్లాది మందిని పొట్టనబెట్టుకున్న హెచ్ఐవీ/ఎయిడ్స్‌ను నయం చేసే ఔషధాన్ని ఇజ్రాయెల్ పరిశోధకులు ప్రయోగాత్మకంగా తీసుకొచ్చారు. ఇంజెక్షన్ రూపంలో ఒక్కసారి రోగులకు ఇస్తే వ్యాధిని నియంత్రించవచ్చని చెబుతున్నారు. వైద్యశాస్త్రంలో ఈ ప్రయోగం గొప్ప ముందడుగు అని వైద్య నిపుణులు కొనియాడు తున్నారు.
కరోనా వంటి కొత్త మహమ్మారి వెలుగుచూసిన ఏడాదిన్నర సమయంలోనే వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చిన వైద్యశాస్త్రం.. గత నలభై ఏండ్లుగా ప్రపంచ దేశాలను కలవరపెడుతున్న హెచ్ఐవీకి మాత్రం సరైన వ్యాక్సిన్‌ను తీసుకురాలేకపోయింది. దీనికి కారణం వ్యాధికి కారణమైన వైరస్ క్షణానికోసారి రూపాంతరం చెందుతుండటమే. ఏదైనా వైరస్ లేదా బ్యాక్టీరియా శరీరంలోకి ప్రవేశిస్తే నిర్ణీత కణజాలాన్ని కేంద్రంగా చేసుకొని కీలక అవయవాలపై ప్రభావం చూపుతుంది. ఎయిడ్స్ (ఎక్వైర్డ్ ఇమ్యూనోడిఫీషియెన్సీ సిండ్రోమ్)కు కారణమయ్యే హెచ్ఐవీ (హ్యూమన్ ఇమ్యూనోడిఫీషియెన్సీ వైరస్) కూడా నిర్ణీత కణజాలాన్ని కేంద్రంగా చేసుకొనే పని ప్రారంభిస్తుంది. అయితే ఎప్పుడైతే వ్యాధినిరోధక కణాలు (సహజమైనవి, కృత్రిమంగా శరీరంలోకి ఇంజెక్ట్ చేసినవి) క్రియాశీలంగా మారి వైరస్‌పై దాడి చేయడానికి ప్రయత్నిస్తాయో.. హెచ్ఐవీ వైరస్ తన రూపాన్ని మార్చుకుంటున్నది. దీంతో ఇమ్యూన్ సిస్టమ్ ఆ వైరస్‌ను కట్టడి చేయలేకపోతున్నది. మిగతా వ్యాధుల విషయంలో ఇలా జరుగడం లేదు. అందుకే, హెచ్ఐవీకి ఇప్పటివరకూ వ్యాక్సిన్/ఔషధం తీసుకురాలేకపోయారు.
ప్రస్తుత ఔషధం ఎలా పనిచేస్తుంది?
హెచ్ఐవీ వైరస్‌ను నియంత్రించడానికి తెల్ల రక్త కణాల్లోని బీ సెల్స్ సాయపడుతాయని గుర్తించిన ఇజ్రాయెల్‌లోని టెల్ అవీవ్ యూనివర్సిటీ పరిశోధకులు.. ‘క్రిస్పర్’ జీన్ ఎడిటింగ్ టెక్నాలజీ సాయంతో వాటిని ఉత్తేజితం చేశారు. దీంతో వైరస్‌కు వ్యతిరేకంగా రోగనిరోధక వ్యవస్థ పనిచేయడం ప్రారంభించింది. ఇమ్యూన్‌సిస్టమ్ యాక్టివేట్ అయిన వెంటనే.. దాని నుంచి తప్పించుకొనేందుకు హెచ్ఐవీ వైరస్.. ఒకటి కంటే ఎక్కువ గ్రూపులుగా విడిపోయి రూపాంతరం చెందడానికి ప్రయత్నించింది. అయితే, దీనిని ముందుగానే ఊహించిన పరిశోధకులు.. రూపాంతరం చెందిన హెచ్ఐవీ వైరస్ గ్రూపులపై కూడా బీ సెల్స్ దాడి చేసేలా జాగ్రత్తలు తీసుకున్నారు. వైరస్ జన్యుక్రమం, రూపాంతరాలను ఎప్పటికప్పుడు పసిగట్టే సర్జ్ఇంజిన్గా ‘క్రిస్పర్’ సాంకేతికతను వినియోగించుకున్నారు.
క్యాన్సర్‌కి కూడా చెక్!
హెచ్ఐవీని తటస్థీకరించే యాంటిబాడీలను మేము సృష్టించాం. ల్యాబ్‌లో అభివృద్ధి చేసిన ఈ ఔషధంతో హెచ్ఐవీని ప్రాథమికంగా నయం చేయొచ్చు. ఇది శక్తివంతమైనది. సురక్షితమైనది కూడా. అయితే, ట్రయల్స్ చేయాల్సి ఉంది. హెచ్‌ఐవీనే కాకుండా క్యాన్సర్, రోగనిరోధక శక్తిని ప్రభావితం చేసే తీవ్రమైన వ్యాధులను కూడా ఈ ఔషధం కట్టడి చేస్తుందని అంచనా వేస్తున్నాం. -డాక్టర్ బార్జెల్, టెల్ అవీవ్ యూనివర్సిటీ