కీవ్: ఉక్రెయిన్ గగనతలాన్ని ‘నో-ఫ్లై జోన్’గా ప్రకటించాలని నాటో కూటమికి జెలెన్స్కీ ప్రతిపాదించడంపై రష్యా అధ్యక్షుడు పుతిన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఉక్రెయిన్ గగనతలాన్ని ఏ దేశమైనా నో ఫ్లై జోన్‌గా విధించినా.. అలా విధించాలని కోరినా యుద్ధానికి దిగినట్టేనని హెచ్చరించారు. ‘నో ఫ్లై జోన్’పై ముందుకు వెళ్తే.. నాటో దేశాలతో పాటు యావత్తు ప్రపంచం తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంద’ని పేర్కొన్నారు. రష్యాపై పశ్చిమ దేశాలు విధిస్తున్న ఆంక్షలు తమపై యుద్ధాన్ని ప్రకటిస్తున్నట్టుగానే పరిగణిస్తామని తెలిపారు. అన్నీ ఆలోచించిన తర్వాతనే ఉక్రెయిన్‌పై యుద్ధానికి దిగామని పేర్కొన్నారు. లక్ష్యం నెరవేరే దాకా ఈ విషయంలో వెనక్కితగ్గేది లేదన్నారు. ‘నో-ఫ్లై జోన్’ను విధించే దేశాలు తమతో యుద్ధానికి సిద్ధపడాలని ఈ సందర్భంగా పేర్కొన్నారు. రష్యాలో ఆందోళనల కట్టడికి మార్షల్ లా విధించే ఆలోచన లేదని పుతిన్ పేర్కొన్నారు.