PM Modi : ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కరచాలనం చేసుకున్నారు. ఫ్రాన్స్‌లో జరుగుతున్న జీ7 సదస్సు దీనికి వేదికైంది. మోదీ, ట్రంప్ దాదాపు 16 నెలల తర్వాత కలుసుకున్నారు. జీ7 సదస్సు మంగళవారం ఫ్రాన్స్‌లోని ఎవియన్ లెస్ బియాన్స్‌లో ప్రారంభమైంది. ఫ్రెంచ్ అధ్యక్షుడు ఎమాన్యుయెల్ మేక్రాన్ ఈ సదస్సుకు నేతృత్వం వహిస్తున్నారు. సదస్సుకు హాజరైన ప్రధాని మోదీకి మేక్రాన్ స్వాగతం పలికారు. ఈ సదస్సుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సహా సభ్య దేశాధినేతలు హాజరయ్యారు.
ఈ సందర్భంగా మోదీ, ట్రంప్ కలుసుకుని, షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నారు. కొద్దిసేపు మాట్లాడుకున్నారు. అనంతరం సదస్సులో ఇద్దరూ పక్కపక్కనే కూర్చున్నారు. గత ఏడాది ఫిబ్రవరి తర్వాత ట్రంప్, మోదీ కలుసుకోవడం ఇదే మొదటిసారి. అప్పుడు మోదీ అమెరికాలో పర్యటించిన సంగతి తెలిసిందే. ఇక, బుధవారం కూడా ట్రంప్, మోదీ మధ్య ప్రత్యేక సమావేశం జరగనుంది. ఇరు దేశాధినేతలు కీలక అంశాలపై చర్చిస్తారు. ఒకవైపు ఇరాన్ యుద్ధం, అంతకుముందు ఇండియా చేపట్టిన ఆపరేషన్ సిందూర్ తర్వాత ట్రంప్, మోదీ మధ్య భేటీ జరగడం కీలకంగా మారింది. అందులోనూ రెండు దేశాల మధ్య వాణిజ్య ఒప్పందం కుదిరినప్పటికీ పూర్తిస్థాయి అవగాహనకు రావాల్సి ఉంది. జీ7 సదస్సు సందర్భంగా వివిధ దేశాధినేతలు గ్రూప్ ఫొటో తీయించుకున్నారు.
ఈ సదస్సులో ఇటలీ ప్రధాని జార్జియా మెలోని, ఈజిప్ట్ ప్రెసిడెంట్ అబ్దెల్ ఫత్తా ఎల్ సిసి, జర్మన్ ఛాన్స్లర్ ఫ్రెడ్రిక్ మెర్జ్, యూకే ప్రధాని కీర్ స్టార్మర్, కెనడా ప్రధాని మార్క్ క్యార్నీ, జపాన్ ప్రధాని సానే తకైచి, యూరప్ కమిషన్ ప్రెసిడెంట్ ఉర్సులా వాన్ డెర్ లెయెన్, బ్రెజిల్ ప్రెసిడెంట్ లుయిజ్ ఇనాసియో లులా డ సిల్వా, యురోపియన్ యూనియన్ కౌన్సిల్ ప్రెసిడెంట్ ఆంటోనియో కోస్టా పాల్గొన్నారు.