మొగదిషు : సోమాలియా పుంట్‌ల్యాండ్ వద్ద ఓ ఇంధన ట్యాంకర్‌ను మంగళవారం తెల్లవారు జామున పైరేట్లు హైజాక్ చేశారు. వారి నుంచి ఆ ట్యాంకర్‌ను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకునే క్రమంలో ముగ్గురు పాకిస్థానీయులు, ఒక భారతీయ నావికుడు, మయన్మార్‌కు చెందిన వ్యక్తి మరణించినట్టు సోమాలియా అధికారులు తెలిపారు. సోమాలియా రాజధాని మొగదిషు వైపు వెళ్తుండగా ఈ ట్యాంకర్‌ను పైరేట్లు హైజాక్ చేశారు.
ట్యాంకర్లో మొత్తం 17 మంది ఉండగా వారిని కాపాడేందుకు భద్రతా బలగాలు చేపట్టిన ఆపరేషన్‌లో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. అయినా పైరేట్లు చికిత్స అందించకుండా ట్యాంకర్‌ను వారి వద్దే ఉంచుకోవడంతో మరణించారని భద్రతా బలగాలు తెలిపాయి. మిగతా వారిని క్షేమంగా రక్షించినట్టు అధికారులు వెల్లడించారు.