Moon | ఫోనిక్స్, మే 14: చంద్రున్ని దగ్గరగా చూడాలనుకుంటున్నారా? చంద్రుని ఉపరితలంపై ఏముందో తెలుసుకోవాలనుకుంటున్నారా? ఇవన్నీ మనకు సాధ్యం కాదని, కలలు కంటున్నారా. అయితే మీ కలలు నిజం కాబోతున్నాయి. అమెరికాలోని అరిజోనాకు చెందిన ఆండ్రూ మెక్‌కార్తీ అనే ఫొటోగ్రాఫర్ అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు. చూపరులను మంత్రముగ్ధులను చేసే చంద్రుని ఫొటోలను బంధించారు.
గిగామూన్ ప్రాజెక్టులో భాగంగా ఆయన వీటిని ఆవిష్కరించారు. 2.80 లక్షల చిత్రాలను కలిపి గిగామూన్ను రూపొందించారు. ఇందులో అపోలో ల్యాండ్ అయిన ప్రాంతాన్ని సైతం చూడవచ్చు. ఈ ఫొటోలో చంద్రుని ఏ భాగాన్ని అయినా జూమ్ చేసి చూడవచ్చు. అర మైలు వరకు జూమ్ చేసి ఈ చిత్రాన్ని చూడవచ్చు. చంద్రునిలో భాగాలైన కోపర్నికస్, టైకో, ప్లాటో, ఎరాటోస్తనిస్, క్లేవియస్ తదితర క్రాటర్లను ఇందులో చూడవచ్చు.
భూమికి సుదూరంగా ఉత్తరాన ఉన్న ప్లాటో క్రాటర్ ఫొటోలను కూడా ఆండ్రూ బంధించారు. 2 టెలిస్కోప్‌లను వినియోగించి ఆండ్రూ ఈ ఫొటోలను బంధించారు. అరిజోనా స్టేట్ యూనివర్సిటీ ఈ విషయాలను వెల్లడించింది. తన ఇంటిలోని గార్డెన్ నుంచి కేవలం రెండు గంటల్లోనే వీటిని ఆయన బంధించడం విశేషం.