NASA | న్యూయార్క్, ఏప్రిల్ 7: సూర్యగ్రహణాన్ని మరింత అధ్యయనం చేయడానికి నాసా జెట్ ప్లేన్లను ఉపయోగించబోతున్నది. సోమవారం సంపూర్ణ సూర్యగ్రహణం ఏర్పడనుంది. ఉత్తర అమెరికాలో గ్రహణం కనిపించనుంది. ఈ నేపథ్యంలో సూర్యుడికి సంబంధించిన అనేక రహస్యాలను చేధించేందుకు సూర్యగ్రహణాన్ని ఉపయోగించుకోవాలని నాసా భావిస్తున్నది. ముఖ్యంగా సూర్యుడి బాహ్య వాతావరణం, భూమి అయనావరణపై సూర్యుడు చూపిస్తున్న ప్రభావాన్ని అర్థం చేసుకునేందుకు, సూర్యుడి కాంతి వల్ల కనిపించకుండా ఉన్న గ్రహశకలాలను గుర్తించేందుకు అధ్యయనం చేయనున్నది.
ఇందుకుగానూ ప్రత్యేక పరికరాలు అమర్చిన రెండు డబ్ల్యూబీ-57 జెట్ ప్లేన్లను వినియోగించనుంది. ఈ జెట్ ప్లేన్లు గంటకు 740 కిలోమీటర్ల వేగంతో 50 వేల అడుగుల ఎత్తున ప్రయాణించగలవు. మేఘాల అడ్డంకి లేకుండా స్పష్టమైన ఫొటోలు తీసుకునేందుకు వీలుగా ఈ జెట్లను వినియోగిస్తున్నది.