సిడ్నీ: ఆస్ట్రేలియా ప్రజలు ఇవాళ జాతీయ ఎన్నికల్లో ఓటేస్తున్నారు. ఈ ఎన్నికల ద్వారా కొత్త ప్రధానిని ఎన్నుకోనున్నారు. ప్రస్తుత ప్రధాని స్కాట్ మారిసన్, లేబర్ నేత ఆంథోనీ అల్బనీస్ మధ్య తీవ్రంగా పోటీ ఉన్నట్లు తెలుస్తోంది. సిడ్నీ కుక్ సీటు నుంచి స్కాట్ పోటీ చేస్తున్నారు. ఇవాళ సిడ్నీలోని లిల్లీ లిల్లీ పబ్లిక్ స్కూల్లో ఆయన ఓటేశారు. భార్య జెన్నీ, కుమార్తెలతో కలిసి ఆయన తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. కుక్ స్థానానికి ప్రాతినిధ్యం వహించడం గౌరవంగా భావిస్తున్నట్లు స్కాట్ తెలిపారు. లేబర్ పార్టీ నేత అల్బనీస్ కూడా ఓటేశారు. ఆస్ట్రేలియా ప్రజల తరపున తాను ప్రాతినిధ్యం వహిస్తున్నట్లు అల్బనీస్ తెలిపారు. విభజన, విబేధాలకు వ్యతిరేకంగా తాము ఉద్యమిస్తున్నట్లు ఆయన అన్నారు. ప్రజల్లో ఐకమత్యం తీసుకురావాలన్నారు. ఈ సారి సుమారు 17 మిలియన్ల ప్రజలు బ్యాలెట్ హక్కును వినియోగించుకోనున్నారు. హౌజ్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్‌లో మొత్తం 151 సీట్లు ఉన్నాయి. దాంట్లో 76 సీట్లు గెలిచిన వాళ్లే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు. ప్రస్తుతం లిబరల్-నేషనల్ కూటమితో పాటు లేబర్ పార్టీలు ప్రధానంగా పోటీపడుతున్నాయి.