Youth | (స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, నవంబర్ 4 (నమస్తే తెలంగాణ): ‘భద్రం బీ కేర్‌ఫుల్ బ్రదరు.. భర్తగా మారకు బ్యాచిలరు.. షాదీ మాటే వద్దు గురూ.. సోలో బతుకే సో బెటరూ’.. ‘మనీ’ సినిమాలోని ఈ పాటను విదేశీ యువత తెగ ఫాలో అయిపోతున్నారు. పెండ్లి చేసుకుంటే ఖర్చు.. పిల్లలు పుడితే వాళ్ల పెంపకం, చదువులకు మళ్లీ ఖర్చు.. జీతం చూస్తే, తక్కువాయె.. దీంతో చాలామంది పెండ్లిని పక్కన పెడుతున్నారు. మరికొందరు పెండ్లి చేసుకొన్నా.. సంతానాన్ని వద్దనుకొంటున్నారు.
ఇప్పుడు ఇదే అక్కడి దేశాధినేతలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నది. జనాభా సంక్షోభం తలెత్తితే సామాజిక సమతౌల్యం దెబ్బతినడమే కాకుండా.. ఉత్పాదకత మీద ప్రభావం పడుతుందని, తద్వారా ఆర్థికాభివృద్ధి పడకేస్తుందని భయపడిపోతున్నారు. దీంతో జనాభాను పెంచుకొనేందుకు కొన్ని దేశాలు పౌరులకు ఆఫర్లు ప్రకటిస్తుంటే, ఇంకొన్ని దేశాలు హాలీడేస్ ఇస్తున్నాయి. మరికొన్ని దేశాలు నగదు ప్రోత్సాహకాలు అందజేస్తున్నాయి.
ఎక్కువ మందిని కంటే రష్యాలో రాయితీలు
రష్యా జనాభాను పెంచడమే తమ ముందున్న ప్రధాన లక్ష్యమని ఇటీవల అధ్యక్షుడు పుతిన్ ప్రకటించారు. మహిళలు ఎనిమిది అంతకంటే ఎక్కువ మంది పిల్లలను కనాలని విజ్ఞప్తి చేశారు. ఎక్కువ మంది పిల్లలను కనే జంటలకు ప్రభుత్వం నుంచి ప్రత్యేక ప్రోత్సాహకాలు ఇచ్చేందుకు, హాలీడే ప్రయాణాల్లో రాయితీలు కల్పించేందుకు కసరత్తు చేస్తున్నట్టు అక్కడి అధికారులు తెలిపారు.
జపాన్‌లో సబ్సిడీలు
కిందటేడాది జపాన్‌లో 15 లక్షల మరణాలు నమోదైతే, జననాలు మాత్రం 8 లక్షలే. జనాభా సంక్షోభం అక్కడ ఏ స్థాయిలో ఉన్నదో దీన్నిబట్టి అర్థంచేసుకోవచ్చు. ఇదే పరిస్థితి కొనసాగితే ప్రస్తుతం 12.5 కోట్లు ఉన్న జపాన్ జనాభా 2060 నాటికి 8.6 కోట్లకు పడిపోతుంది. దీంతో జనాభాను పెంచడంలో భాగంగా ప్రజలను ప్రోత్సహించడానికి ప్రభుత్వమే ఓ ప్రత్యేక ప్రభుత్వ శాఖను ఏర్పాటు చేసింది. పిల్లల్ని కనే వారికి ప్రభుత్వ సబ్సిడీలు, నగదు ప్రోత్సాహకాలు, పిల్లల ఆలనాపాలన చూసుకొనేందుకు ప్రత్యేకంగా సెలవులు ఇస్తున్నారు.
చైనాలో వేతనంతో కూడిన హాలీడేలు
జనాభా అంటే గుర్తొచ్చే చైనాలో.. 1980ల్లో తీసుకొచ్చిన ఏక సంతాన విధానం కారణంగా జననాల రేటు భారీగా తగ్గిపోతున్నది. 60 ఏండ్ల తర్వాత మొదటిసారి 2022లో చైనా జనాభాలో తగ్గుదల నమోదైంది. గత కొన్నేండ్లుగా జనాభా తగ్గుదలతో అప్రమత్తమైన చైనా 2015లో ఏక సంతాన విధానం తొలగించి ఇద్దరిని కనవచ్చని చెప్పింది. 2021 నుంచి ముగ్గురిని కనాలని చెప్తున్నది. ప్రభుత్వం ఏం చెప్పినా చైనా యువత మాత్రం పెండ్లివైపు మొగ్గు చూపడం లేదు. దీంతో విద్యార్థులు ప్రేమలో పడేందుకు అక్కడి తొమ్మిది కాలేజీలు వారం పాటు సెలవులు ప్రకటించాయి. మరికొన్ని కంపెనీలు ఉద్యోగులకు ‘లవ్ హాలీడేస్’ పేరిట వేతనంతో కూడిన సెలవులను ఇస్తున్నాయి.
దక్షిణ కొరియాలో ప్రత్యేక టీవీ షోలు
ప్రపంచంలో తక్కువ సంతానోత్పత్తి ఉన్న దేశంగా దక్షిణ కొరియా మారుతున్నది. ఆ దేశ సంతానోత్పత్తి రేటు 0.79 మాత్రమే. ఒకవైపు తగ్గిపోతున్న సంతానోత్పత్తి రేటు వల్ల దేశం జనాభా సంక్షోభంతో ఉంటే అక్కడ యువత అసలు పెండ్లిళ్లకే ఇష్టపడటం లేదు. ఖర్చులే దీనికి కారణంగా తెలుస్తున్నది. దీంతో యువతను పెండ్లి వైపు ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ప్రత్యేక టీవీ షోలు ఏర్పాటు చేస్తున్నది.
రూ. 83కే ఇండ్లు ఇస్తామంటున్న ఇటలీ
జనాభా పెరుగుదలకు చేస్తున్న కార్యక్రమాలు సత్ఫలితాలు ఇవ్వకపోవడంతో ఇటలీ ప్రభుత్వాధికారులు వినూత్న నిర్ణయం తీసుకొన్నారు. ఎవరైనా తమ నగరాల్లో కనిష్ఠంగా మూడేండ్లపాటు ఉండి ఉద్యోగాలు చేసుకొంటే.. తామే 30 వేల డాలర్లు (రూ. 25 లక్షలు) ఎదురు చెల్లిస్తామని, అలాగే, పౌరసత్వం, ఒక డాలర్‌కే (రూ. 83) ఉండటానికి ఇండ్లు ఇస్తామని ప్రకటించారు. పుగ్లియా, కలబ్రియా వంటి ప్రాంతాల్లోని స్థానిక ప్రభుత్వాలు ఇప్పటికే ఈ మేరకు ఉత్తర్వులు కూడా జారీ చేశాయి.
ఎక్కువ మందిని కనండి: కిమ్
జననాల రేటు తగ్గుతుండటంపై ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ ఆందోళన చెందుతున్నారు. పతనమవుతున్న జననాల రేటుకు అడ్డుకట్ట వేయవలసిన బాధ్యత మహిళలపై ఉందని చెప్పారు. జనాభా వివరాలను ఉత్తర కొరియా చాలా వరకు గోప్యంగా ఉంచుతుంది. అయితే దక్షిణ కొరియా ప్రభుత్వ అంచనా ప్రకారం పదేళ్ల నుంచి ఉత్తర కొరియాలో జననాల రేటు క్రమంగా తగ్గుతున్నది. ఈ నేపథ్యంలో ఆదివారం జరిగిన జాతీయ మాతృమూర్తుల సమావేశంలో కిమ్ మాట్లాడుతూ, ఎక్కువ మంది పిల్లలను కనాలని పిలుపునిచ్చారు.