వాషింగ్టన్, డిసెంబర్ 20: ప్రపంచ దేశాలు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్న అమెరికా లైంగిక నేరగాడు జెఫ్రీ ఎపిస్టీన్ ఫైళ్లను అమెరికా న్యాయ శాఖ ఎట్టకేలకు శుక్రవారం విడుదల చేసింది. ఈ వివాదాస్పద ఫైళ్లను న్యాయ శాఖ వెబ్సైట్లో అప్లోడ్ చేయడం ప్రారంభించింది. తాజాగా విడుదల చేసిన ఫైళ్లలో ప్రముఖులైన అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్, ఆండ్రూ మౌంట్‌బాటెన్-విండ్సర్, పాప్ సింగర్స్ మైఖేల్ జాక్సన్, మిక్ జాగర్ తదితరులు ఉన్నారు. బిల్ క్లింటన్ ఒక స్విమ్మింగ్ పూల్‌లో ఈత కొడుతున్నట్టు ఒక ఫొటో ఉంది. అనేక లక్షల పేజీల పత్రాలు ఇప్పటికీ సమీక్షిస్తున్నామని, అవి ఇంకా బహిరంగ పర్చలేదని డిప్యూటీ అటార్నీ జనరల్ టాడ్ బ్లాంచే స్పష్టం చేశారు.
తాజా పత్రాలలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై సంబంధించిన వివాదాస్పద చిత్రాలు లేవు. విడుదలైన ఫొటోల్లో నగ్నంగా, తక్కువ దుస్తులతో ఉన్న కొందరి మహిళల చిత్రాలు ఉన్నాయి. అమెరికా న్యాయ శాఖ (డీవోజే) డెడ్‌లైన్ లోగా అన్ని పత్రాలను విడుదల చేయడంలో విఫలమై దాని చట్టపరమైన బాధ్యతలను ఉల్లంఘించిందని విపక్ష డెమోక్రాట్లు, కొందరు అధికార రిపబ్లికన్లు ఆరోపించారు. వేల పైళ్లలోని పలు వివరాలను భారీగా మార్చేశారని తెలిపారు. ఎపిస్టీన్ ఫైళ్లల్లో క్లింటన్ పేరు బయటికి రావడంపై ఆయన ప్రతినిధి స్పందిస్తూ ప్రభుత్వం ఈ కేసులో క్లింటన్‌ను బలిపశువుగా చేసిందన్నారు.