న్యూఢిల్లీ, సెప్టెంబర్ 24: చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌ను ఆ దేశ సైన్యం గృహనిర్బంధంలో ఉంచిందా? పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పీఎల్ఏ) ఇంచార్జి బాధ్యతల నుంచి కూడా తప్పించిందా? అంటే అవునంటూ పాశ్చాత్య మీడియాలో జోరుగా ప్రచారం సాగుతున్నది. చైనా సైన్యం జిన్‌పింగ్‌ను హౌజ్ అరెస్టు చేసిందని, పీఎల్ఏ బాధ్యతల నుంచి తప్పించిందని వార్తలు వస్తున్నాయి. ట్విట్టర్లోనూ పెద్ద ఎత్తున చర్చలు సాగుతున్నాయి. మరోవైపు గత గురువారం చైనా సైన్యానికి చెందిన భారీ కాన్వాయ్ దేశ రాజధాని బీజింగ్ దిశగా సాగుతున్నదని ప్రవాసంలో ఉంటున్న చైనా మానవ హక్కుల కార్యకర్త జెన్నిఫర్ జెంగ్ ఓ వీడియోను ట్విట్టర్లో పోస్ట్ చేశారు. దాదాపు 80 కిలోమీటర్ల పొడవున సైనిక వాహనాలు బీజింగ్ వైపు వెళ్తున్నాయని తెలిపారు. షాంఘై సహకార సమాఖ్య (ఎస్సీవో) సమావేశాల్లో పాల్గొనేందుకు జిన్‌పింగ్ ఇటీవల సమర్ఖండ్ వెళ్లారు. ఆ సమయంలో కమ్యూనిస్టు పార్టీలోని ఆయన వ్యతిరేకులు జిన్‌పింగ్‌ను సైన్యాధినేత బాధ్యతల నుంచి తప్పించారని, తిరిగి స్వదేశం రాగానే గృహ నిర్బంధంలో ఉంచారని వార్తలు వెలువడ్డాయి. మరో వార్త కూడా ప్రచారంలో ఉన్నది. అదేమిటంటే.. జిన్‌పింగ్‌కు వ్యతిరేకంగా గళం విప్పిన కొందరు సైనిక జనరళ్లకు ఇటీవల కోర్టు జీవితకాల కారాగార శిక్ష విధించింది. దీన్ని వ్యతిరేకిస్తూ సైన్యమే జిన్‌పింగ్‌ను గృహ నిర్బంధంలో ఉంచిందని అంటున్నారు. ఉజ్బెకిస్థాన్‌లో షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సదస్సు ముగించుకొని జిన్‌పింగ్ విమానం బీజింగ్‌లో దిగగానే ఆయనను హౌజ్ అరెస్టు చేసినట్టు ప్రచారం సాగుతున్నది. ప్రణాళికలో భాగంగానే.. జిన్‌పింగ్‌కు మోదీ, పుతిన్‌తో సమావేశాలను షెడ్యూల్ చేయలేదని తెలిసింది.
9,583 విమానాలు రద్దు
చైనా నుంచి విదేశాలకు వెళ్లాల్సిన దాదాపు 60 శాతం విమానాలను శుక్రవారం నిరవధికంగా నిలిపేశారు. 9,583 దేశీయ, అంతర్జాతీయ విమానాలు, పలు హైస్పీడ్ రైళ్లు రద్దయినట్టు సమాచారం. అందుకు కారణాలను అధికారులు చెప్పటంలేదు. జిన్‌పింగ్ హౌస్ అరెస్టు వార్తలపై బీజేపీ నేత సుబ్రమణ్యస్వామి కూడా స్పందించారు. చైనాలో ఏం జరుగుతున్నది? జిన్‌పింగ్ హౌస్ అరెస్టు అయినట్టు వార్తలు వస్తున్నాయి.. నిజమేనా? అని ట్వీట్ చేశారు. చైనాలో భారీగా మంటలు చెలరేగుతున్నందుకే ఇంతలా పొగ వస్తున్నదని అమెరికాలో ప్రవాసం ఉంటున్న చైనా రచయిత గోర్డన్ చాంగ్ ట్వీట్ చేశారు. చైనా ఇప్పుడు సుస్థిరంగా లేదని పేర్కొన్నారు.
కొత్త అధ్యక్షుడిగా లీ కియోమింగ్?
జిన్‌పింగ్‌ను గృహనిర్బంధం చేశారన్న వార్తలు గుప్పుమనగానే మరి కొత్త అధ్యక్షుడిగా ఎవరిని ఎన్నుకొన్నారనే చర్చ మొదలైంది. చైనీస్ ఆర్మీ జనరల్‌గా ఉన్న లీ కియోమింగ్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టే అవకాశం ఉన్నదని ప్రచారం సాగుతున్నది. ఈయన ప్రస్తుతం చైనీస్ కమ్యూనిస్టు పార్టీలో సెంట్రల్ కమిటీ సభ్యుడిగా ఉన్నారు.