Iraq | బాగ్దాద్, ఏప్రిల్ 28: స్వలింగ సంపర్క సంబంధాలను నేరంగా పరిగణిస్తూ ఇరాక్ పార్లమెంట్ ఒక చట్టాన్ని ఆమోదించింది. దీనిని ఉల్లంఘించిన వారికి 15 ఏండ్ల గరిష్ఠ కారాగార శిక్ష విధించనున్నట్టు పేర్కొంది. అయితే ఇది ఎల్జీబీటీ కమ్యూనిటీపై దాడిగా హక్కుల న్యాయవాదులు ఖండించారు.
ఇరాక్ సమాజాన్ని నైతిక పతనం నుంచి రక్షించడానికి, ప్రపంచంలో పెరిగిపోతున్న స్వలింగ సంపర్కాన్ని నిరోధించడానికి ఈ చట్టాన్ని తీసుకువచ్చినట్టు ఇరాక్ తన చట్టంలో పేర్కొంది. ప్రభుత్వంలో ప్రధాన భాగస్వాములుగా ఉన్న సంప్రదాయ షియా ముస్లిం పార్టీల ఒత్తిడి మేరకు ఈ బిల్లును ప్రవేశపెట్టారు. ఈ చట్ట ప్రకారం వ్యభిచారం, స్వలింగ సంపర్కాన్ని నిరోధిస్తూ.. వాటిని అతిక్రమించిన వారికి కనీసం 10, గరిష్ఠంగా 15 ఏండ్ల కారాగార శిక్షను విధిస్తారు. అలాగే వీటిని ప్రోత్సహించిన వారికి కనీసం ఏడేండ్ల జైలు శిక్ష విధిస్తారు.