JD Vance : ఇరాన్-అమెరికా (Iran-US) మధ్య కాల్పుల విరమణ (USA-Iran ceasefire) ఒప్పందం కుదిరిన నేపథ్యంలో అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ (JD Vance) కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ మూడు వెర్షన్లలో తన 10 పాయింట్ల ప్రతిపాదనలు పంపిందని, అందులో ఒకటి చాట్‌జీపీటీ (ChatGpt) రాసినట్లుగా ఉందని ఆయన మీడియాతో అన్నారు. ఇరాన్ నుంచి వచ్చిన మూడు వేర్వేరు ప్రతిపాదనలు గందరగోళాన్ని సృష్టించాయని పేర్కొన్నారు.
తొలుత 10 పాయింట్లతో ఒక ప్రతిపాదనను పంపించారని, అయితే అది చాట్‌జీపీటీ రాసినట్లుగా ఉందని వాన్స్ అన్నారు. పశ్చిమాసియాలో అమెరికా ప్రత్యేక రాయబారి స్టీవ్ విట్కాఫ్, ట్రంప్ అల్లుడు జారెడ్ కుష్నర్‌లకు ఆ ప్రతిపాదనలు అందాయని చెప్పారు. వెంటనే వారు ఆ ప్రతిపాదనలను తిరస్కరించారని తెలిపారు. ఇరాన్ ప్రతిపాదనలకు సంబంధించిన రెండో వర్షన్‌కు తాము అంగీకరించామని, కాల్పుల విరమణ ప్రకటనలో అధ్యక్షుడు ట్రంప్ దాన్నే ప్రస్తావించారని చెప్పారు.
ప్రతిపాదనలకు సంబంధించిన మూడో వెర్షన్ మొదటి దానికంటే అత్యంత దారుణంగా ఉందని, అందులోని డిమాండ్లు అంగీకరించలేని విధంగా ఉన్నాయని అన్నారు. సోషల్ మీడియా ద్వారా ఈ మూడో ప్రతిపాదన గురించి తమకు తెలిసిందని చెప్పారు. లెబనాన్ కారణంగా కాల్పుల విరమణ విఫలం కాకుండా చూడాలని వాన్స్ ఇరాన్‌ను కోరారు. ఈ సీజ్ఫైర్ నిబంధనల్లో ఇజ్రాయెల్ సైనిక కార్యకలాపాల గురించి చర్చనే లేదని అన్నారు.
ఇదిలావుంటే, ఇస్లామాబాద్ వేదికగా అమెరికా-ఇరాన్ మధ్య తొలి దశ చర్చలు ఈ శనివారం ప్రారంభం కానున్నాయి. ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ నేతృత్వంలో అమెరికా బృందం ఈ చర్చల్లో పాల్గొననున్నట్లు తెలుస్తున్నది.