Iran vs US : అంతర్జాతీయ స్థిరత్వానికి ఇరాన్ (Iran) నుంచి ముప్పు పొంచి ఉన్నదని, అందుకే తాము సాహసోపేతమైన, ప్రమాదకరమైన మిషన్ను చేపట్టామని అమెరికా రక్షణ శాఖ మంత్రి పీట్ హెగ్సెత్ (Pete Hegseth) అన్నారు. హర్మూజ్ జలసంధి (Strait of Hormuz) వద్ద ఇరాన్ నౌకల రాకపోకలపై అమెరికా దిగ్బంధం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ.. ఈ జలసంధిపై నియంత్రణను మరింతకాలం పొడిగిస్తామని స్పష్టంచేశారు. హర్మూజ్ జలసంధి వద్ద అమెరికా నేవీ (American Navy) దిగ్బంధనాన్ని ఆయన ఉక్కు కవచంతో పోల్చారు. ఇది శాశ్వత నిర్బంధంగా కొనసాగే అవకాశం ఉందని అన్నారు.
ఇరాన్ తన అణ్వాయుధాల తయారీని విడనాడే వరకు ఆ దేశంపై ఒత్తిడి ఉంటుందని హెగ్సెత్ స్పష్టంచేశారు. తమ అనుమతి లేకుండా హర్ముజ్ జలసంధిని ఏ రవాణా నౌక దాటదని హెచ్చరించారు. జలసంధిలో నౌకలపై దాడులు చేస్తూ టెహ్రాన్ సముద్రపు దొంగల ముఠాలా ప్రవర్తిస్తోందని ఆరోపించారు. ఇరాన్ సముద్ర భద్రతను అస్థిరపరుస్తోందని విమర్శించారు. తమ దిగ్బంధనం గల్ఫ్ దాటి విస్తరిస్తోందని తెలిపారు. అంతర్జాతీయ వాణిజ్యాన్ని కాపాడేందుకు తాము ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొంటామని అన్నారు. ఇస్లామాబాద్ వేదికగా అమెరికా, ఇరాన్ పరోక్ష చర్చలకు సిద్ధమైన సమయంలో హెగ్సెత్ ఈ వ్యాఖ్యలు చేశారు.