తాను తీసుకున్న నిర్ణయంతో ప్రతిపక్షాలకు దిమ్మ తిరిగిపోయిందని పాక్ ఆపద్ధర్మ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అన్నారు. ఈ పరిస్థితులను చూసి ఇబ్బందులు పడొద్దని కార్యకర్తలకు శనివారమే సూచనలు చేశానని గుర్తు చేసుకున్నారు. ఈ పరిస్థితిని చూసి, కార్యకర్తలు హైరానా పడొద్దని, తాను తీసుకున్న నిర్ణయంతో ప్రతిపక్షాలు ఒక్కసారిగా షాక్ తిన్నాయని చెప్పుకొచ్చారు. అసలు ఏం జరుగుతోంది, ఏం జరగబోతోంది? అన్న దానిపై ప్రతిపక్షాలు ఓ అంచనాకు కూడా రాలేకపోతున్నాయని ఇమ్రాన్ ఎద్దేవా చేశారు.
పాక్ జాతీయ అసెంబ్లీని రద్దు చేస్తూ పాకిస్తాన్ రాష్ట్రపతి అరిఫ్ అల్వీ నిర్ణయం తీసుకున్నారు. జాతీయ అసెంబ్లీని రద్దు చేయాలంటూ ప్రధాని ఇమ్రాన్ సిఫార్సు చేసిన కేవలం 30 నిమిషాల్లోనే రాష్ట్రపతి రద్దు చేయడం ఆసక్తికర పరిణామం. ఇక.. 90 రోజుల్లో పాకిస్తాన్లో ఎన్నికలు జరగనున్నాయి. రాజ్యాంగంలోని 224 ఆర్టికల్ ప్రకారం ప్రధానిగా ఇమ్రాన్ తన విధులను నిర్వర్తిస్తారని మంత్రి ఫవాద్ చౌధురి ప్రకటించారు. అయితే కేబినెట్ మాత్రం రద్దైందని ఆయన పేర్కొన్నారు.