Oil spill : గల్ఫ్ ఆఫ్ మెక్సికో (Gulf of Mexico) లో సముద్రంపై 600 కిలోమీటర్ల మేర భారీ చమురు తెట్టు ఏర్పడింది. మెక్సికన్ అధికారులు ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ చమురు తెట్టువల్ల ఏడు ప్రకృతి సంరక్షణ ప్రాంతాలతో సహా సముద్రంలోని జీవరాశులపై పెను ప్రభావం పడిందన్నారు. రెండు సహజ చమురు ఊటలు వ్యాపించడం, ఓ చమురు నౌక సముద్రంలో బోల్తాపడడంవల్ల ఈ ముప్పు సంభవించిందని చెప్పారు.
ఐదు నెలల క్రితం భారీ వర్షాలు, వరదల కారణంగా మెక్సికోలోని తూర్పు రాష్ట్రమైన వెరాక్రూజ్లో ముడి చమురు సహజంగా ఊరే ఒక పైప్లైన్ పగిలిపోయింది. ఆ పైప్లైన్ నుంచి లీకైన చమురు పాంటెపెక్ నది, టబాస్కో దక్షిణ రాష్ట్రాలలోని 200 కిలోమీటర్ల తీరప్రాంతంతో సహా 600 కిలోమీటర్ల మేర వ్యాపించింది. కాంపెచే బేలో ఉన్న మరో సహజ చమురు ఊట కూడా సముద్రతీరంలో వ్యాపించింది. ఇప్పటికీ అందులో నుంచి చమురు లీక్ అవుతున్నది.
నెల రోజులుగా ఈ రెండు సహజ చమురు ఊటల నుంచి పెద్ద మొత్తంలో కలుషితాలు వెలువడుతున్నాయి. మరోవైపు మూడు నెలల క్రితం గల్ఫ్ ఆఫ్ మెక్సికోలో చమురు నౌక బోల్తా పడటంతో సముద్రంలో చమురు లీక్ అయ్యిందని అధికారులు తెలిపారు. దానివల్ల వందల సంఖ్యలో సముద్ర తాబేళ్లు, చేపలతో సహా వివిధ జలచరాలు ప్రాణాలు కోల్పోతున్నాయన్నారు.