హోనియారా: శిశువు సైజు అంత పరిమాణంలో ఉన్న పెద్ద కప్ప ఫొటో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. దీని గురించి తెలుసుకున్న నెటిజన్లు నోరెళ్లబెడుతున్నారు. సోలమన్ దీవులకు చెందిన ఒక గ్రామంలోని వారికి ఒక పెద్ద కప్ప కంటబడింది. పుట్టిన బిడ్డ సైజు ఉన్న దీనిని ఒక బాలుడు తన రెండు చేతులతో పట్టుకోగా హోనియారాకు చెందిన జిమ్మీ హ్యూగో అనే వ్యక్తి ఫొటో తీశారు. అనంతరం తన ఫేస్బుక్లో ఈ భారీ కప్ప ఫొటోను పోస్ట్ చేశారు.
ఈ ఏడాది ఏప్రిల్ నెలలో మిల్లులో పని చేసే కార్మికులు అడవి పంది కోసం వేటకు వెళ్లగా ఈ పెద్ద కప్ప వారి కంటపడిందని జిమ్మీ పేర్కొన్నారు. భారీ సైజులో ఉన్న ఈ కప్పను కార్నుఫర్ గుప్పీ, జెయిండ్ వెబ్బడ్ కప్ప అని పిలుస్తారని తెలిపారు. స్థానికులు దీని మాంసాన్ని లొట్టలేసుకుని తింటారని అందుకే దీనిని బుష్ చికెన్‌గా వ్యవహరిస్తారని వెల్లడించారు.
మరోవైపు ఈ భారీ సైజు కప్ప ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇంత భారీ కప్పను తాము ఎప్పుడూ చూడలేదని నెటిజన్లతోపాటు కొందరు పర్యావరణ శాస్త్రవేత్తలు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇలాంటి పెద్ద కప్పలు చాలా అరుదుగా ఉంటాయని, వాటి వయసు ఎక్కువ ఉండవచ్చని అభిప్రాయపడ్డారు.