వాషింగ్టన్: అమెరికాలో ఒక వింత చేప పట్టుబడింది. మనుషుల మాదిరిగా దంతాలు ఉండటమే దీని ప్రత్యేకత. నార్త్ కరోలినా సముద్ర తీరంలోని బీచ్‌లో తిరుగాడే కొందరు ఈ అరుదైన చేపను గుర్తించారు. దీనికి మానవుల వంటి పళ్లు ఉండటం చూసి వారు ఆశ్చర్యపోయారు. నార్త్ కరోలినాలోని చేపల స్థావరమైన నాగ్స్ హెడ్లో తొమ్మిది పౌండ్ల బరువున్న ఈ వింత చేప వారి కంటపడింది.
గొర్రె నోటిని పోలిన దీనిని ‘షీప్స్ హెడ్’ ఫిష్‌గా గుర్తించారు. దాని నోట్లో అనేక పళ్ల వరుసలు ఉన్నాయి. గుల్లలు, నత్తలు వంటి వాటిని పళ్ల సహాయంతో అది నమిలి తింటుంది. షీప్స్ హెడ్ చేపలు సాధారణంగా రాళ్లు, జెట్టీలు, దిబ్బలు, వంతెనల దగ్గర కనిపిస్తాయి. నలుపు, తెలుపు చారలు ఉండటంతో వాటిని ‘కన్విక్ట్ ఫిష్’గాను పిలుస్తారు.
కాగా, కట్టుడు పళ్లలాంటి దంతాలున్న ఈ వింత చేప ఫొటోను జెన్నెట్స్ పీర్ అనే వ్యక్తి తన ఫేస్బుక్ ఖాతాలో పోస్ట్ చేశారు. ‘బిగ్తీత్బిగ్టైమ్స్’ అని హ్యాష్‌ట్యాగ్ ఇచ్చిన ఈ వింత చేప ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.