సముద్రపు నీళ్లలో నిప్పు రవ్వ రగిలింది. నీటిని చీలుస్తూ, నిలువునా కాలుస్తూ పైకి ఎగిసింది. నడి సంద్రంలో అగ్నిగుండం పుట్టింది. మెక్సికోలోని యుకటాన్ ద్వీపకల్పానికి పశ్చిమాన సముద్ర తీరంలో నీళ్లలో మంటలు చెలరేగాయి. మెక్సికోకు చెందిన పెమెక్స్ పెట్రోలియం కంపెనీ పైప్లైన్ పగిలిపోవడంతో చమురు లీక్ అయింది. ఇది మంటలకు కారణమైంది. అదృష్టవశాత్తూ ఎలాంటి ప్రాణనష్టం జరుగలేదు. పెట్రోలియం ఉత్పత్తికి కూడా ఆటంకం కలగలేదని కంపెనీ తెలిపింది. దాదాపు 5 గంటల తర్వాత మంటలను అదుపులోకి తెచ్చారు.