Jeffrey Epstein : అమెరికా (USA) లో సంచలనం సృష్టించిన లైంగిక నేరగాడు, వివాదాస్పద ఫైనాన్షియర్ జెఫ్రీ ఎప్స్టీన్ (Jeffrey Epstein) జైలులో ఆత్మహత్య చేసుకోవడానికి ముందు ఓ సూసైడ్ నోట్ (Suicide Note) రాశాడు. కోర్టు ఆదేశాల మేరకు ఆ సూసైడ్ నోట్ (Suicide Note) ను అధికారులు గత ఏడేళ్లుగా అత్యంత రహస్యంగా ఉంచారు. ఈ విషయాన్ని న్యూయార్క్ టైమ్స్ (NewYork Times) తన కథనంలో వెల్లడించింది. ఎప్స్టీన్ (Epstein) సూసైడ్ నోట్‌ను బహిర్గతం చేయాలని కోరుతూ న్యూయార్క్ టైమ్స్ పత్రిక కోర్టును ఆశ్రయించడంతో ఈ సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. ఎప్స్టీన్ మృతిపై దర్యాప్తులో ఈ లేఖ కీలకం కానుందని నిపుణులు భావిస్తున్నారు.
వివరాల్లోకి వెళ్తే.. ఎప్స్టీన్ 2019 ఆగస్టులో మాన్హాటన్ జైలులోని తన గదిలో మరణించాడు. అయితే అంతకు కొన్ని వారాల ముందు జూలై నెలలో అతను మొదటిసారి ఆత్మహత్యాయత్నం చేశాడు. అప్పుడు ఒక సూసైడ్ నోట్ రాశాడు. ఆ సమయంలో అతని సెల్‌మేట్, పలు హత్య కేసుల్లో శిక్ష అనుభవిస్తున్న మాజీ పోలీస్ అధికారి నికోలస్ టార్టాగ్లియోన్కు ఆ నోట్ దొరికింది. వారిద్దరి గదిలోని ఒక పుస్తకంలో పసుపు రంగు కాగితంపై ‘ఇక వీడ్కోలు చెప్పే సమయం వచ్చింది’ అని ఎప్స్టీన్ రాసి పెట్టినట్లు టార్టాగ్లియోన్ గుర్తించాడు.
అయితే తనపై దాడి చేసి ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశాడని ఎప్స్టీన్ తనపై నిందవేస్తాడేమోనన్న భయంతో టార్టాగ్లియోన్ ఆ నోట్‌ను జైలు అధికారులకు కాకుండా నేరుగా తన న్యాయవాదులకు ఇచ్చాడు. వారు దాని ప్రామాణికతను నిర్ధారించుకున్నారని చెబుతున్నప్పటికీ, ఆ తర్వాత టార్టాగ్లియోన్ కేసును విచారిస్తున్న ఫెడరల్ జడ్జి ఆ నోట్‌ను సీల్ చేసి, గోప్యంగా ఉంచాలని ఆదేశించారు. ఆసక్తికరమైన విషయమేమిటంటే, ఇప్పటివరకు ఎప్స్టీన్ మృతిపై దర్యాప్తు చేస్తున్న అధికారులు గానీ, న్యాయ శాఖగానీ ఈ నోట్‌ను పరిశీలించలేదు.
ఈ నోట్‌కు టార్టాగ్లియోన్ కేసుతో సంబంధం లేదని, ఎప్స్టీన్ చివరి రోజుల్లోని మానసిక పరిస్థితిని అర్థం చేసుకోవడానికి, అతని మృతిపై దర్యాప్తులో ఇది కీలకమైన ఆధారమని న్యూయార్క్ టైమ్స్ వాదిస్తోంది. అందుకే దానిని బహిర్గతం చేయాలని కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ప్రపంచంలోని అత్యంత శక్తిమంతులతో ఎప్స్టీన్ నెరిపిన లైంగిక నేరాల నెట్‌వర్క్‌కు సంబంధించిన వేలాది పత్రాలు ఇటీవల బయటకు వస్తున్న నేపథ్యంలో ఈ సూసైడ్ నోట్ ఉదంతం మరింత ప్రాధాన్యం సంతరించుకుంది.