Donald Trump : తనను తెలివి తక్కువ వాడు అనవద్దని, కావాలంటే ప్రతిభావంతుడైన నిరంకుశ నియంత అని పిలుచుకోండని అమెరికా అధ్యక్షుడు (US President) డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) సూచించారు. శుక్రవారం న్యూయార్క్ (Newyork) లో జరిగిన ఓ ర్యాలీలో పాల్గొన్న ట్రంప్ తన మానసిక సామర్థ్యం గురించి మాట్లాడారు. తనను ఎవరైనా తెలివి తక్కువ వాడని అంటే విపరీతంగా బాధపడతానని చెప్పుకొచ్చారు.
మీరు కలిసిన వారిలోకెల్లా తానే అత్యంత తెలివైన వ్యక్తినని ట్రంప్ ఓ ర్యాలీలో పాల్గొన్న జనసమూహంతో అన్నారు. ‘మరి మీకు తెలివైన వ్యక్తి అధ్యక్షుడిగా ఉండాలని లేదా..?’ అని ప్రశ్నించారు. వాస్తవానికి ఆ ర్యాలీ ద్రవ్యోల్బణం, అందుబాటు ధరల గురించి ఉద్దేశించినది. కానీ ట్రంప్ మాత్రం తన మానసిక ఆరోగ్యం గురించే ఎక్కువగా మాట్లాడారు. తన తెలివి గురించి పరీక్షించుకునేందుకు ఓ వైద్యుడిని కలిసి టెస్ట్ కూడా చేయించుకున్నానని చెప్పారు.
డాక్టర్ తనకు ఒక మేధోపరమైన పరీక్ష నిర్వహించారని, అందులో తాను అత్యధిక మార్కులు సంపాదించుకున్నానని ట్రంప్ తెలిపారు. తాను ఉత్తీర్ణత సాధించానని ట్రంప్ చెప్పుకుంటున్న ‘మాంట్రియల్ కాగ్నిటివ్ అసెస్మెంట్’ అనేది మతిమరుపు వ్యాధిని (డిమెన్షియాను) గుర్తించడానికి చేసే ఒక పరీక్ష కాగా.. వైద్యులు నిర్వహించిన ఆ పరీక్షలో తాను మూడుసార్లు ఉత్తీర్ణుడనయ్యానని ట్రంప్ చెప్పారు.