Plastic soap | న్యూయార్క్: ప్లాస్టిక్ సబ్బులేంటని ఆశ్చర్యపోకండి! ప్లాస్టిక్‌తో సబ్బులను తయారు చేస్తున్నట్టు అమెరికాలోని వర్జినీయా టెక్ యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ గులియాంగ్ లియు వెల్లడించారు. భూమిపై గుట్టలుగా పేరుకుపోతున్న ప్లాస్టిక్ మానవాళికి పెను సవాలుగా మారుతున్నది. ఈ సమస్యకు గులియాంగ్ లియు వినూత్నమైన పరిష్కారాన్ని కనుగొన్నారు.
ప్లాస్టిక్ పదార్థాలు సబ్బుల తయారీలో వినియోగించే ఫ్యాటీ యాసిడ్ (కొవ్వు ఆమ్లాలు)ను పోలి ఉంటుందని గులియాంగ్ లియు గుర్తించారు. ఈ రెండింటి మధ్య పరిమాణంలో మాత్రమే తేడా ఉంటుంది. ప్లాస్టిక్‌ను మండించేందుకు ఓ ఒవెన్ లాంటి పెద్ద రియాక్టర్‌ను శాస్త్రవేత్తల బృందం రూపొందించింది. పాలిథిన్ను అణువులుగా విడగొట్టేందుకు వీలుగా దీని కింది భాగంలో ఎక్కువ వేడి వచ్చేలా, పై భాగంలో చల్లదనం ఉండేలా రియాక్టర్‌ను తయారు చేశారు. ఈ రియాక్టర్ సాయంతో పాలిథిన్ను ఫ్యాటీ యాసిడ్లుగా మార్చారు. ప్లాస్టిక్‌ను మండించగా వచ్చిన మైనం లాంటి పదార్థంతో సబ్బులు తయారు చేశారు.