వాషింగ్టన్: జపాన్ ప్రధాని సనేయి తకాయిచికి షాకిచ్చారు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్. ఓవల్ ఆఫీసులో ట్రంప్‌ను జపాన్ ప్రధాని కలిశారు. ఆ సమయంలో జపనీస్ రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు ట్రంప్ బదులిచ్చారు. ఆ సమాధానంతో తకాయిచి కాస్త ఒడిదిడుకులకు లోనయ్యారు. ఇటీవల ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ దళాలు దాడి చేసిన విషయం తెలిసిందే. అయితే మిత్ర దేశాలతో సంప్రదింపులు చేయకుండా ఇరాన్‌పై ఎందుకు దాడి చేశారని ఓ రిపోర్టర్ అడిగారు. దానికి ట్రంప్ స్పందిస్తూ తనదైన స్టయిల్లో జోకేశారు. తాము ఆ దాడి గురించి ఎవరికీ చెప్పలేదని, ఎందుకంటే మేం సర్ప్రైజ్ చేయాలనుకున్నామని, సర్ప్రైజ్ గురించి జపాన్ కన్నా బాగా తెలిసిన దేశం ఏదైనా ఉంటుందా, ఓకేనా.. మీరెందుకు పెరల్ హార్బర్ దాడి గురించి నాకు చెప్పలేదని ట్రంప్ అన్నారు. దీంతో పక్కనే కూర్చున్న జపాన్ ప్రధాని తకాయిచి కాస్త ట్రంప్ తీరుతో స్టన్ అయ్యారు.
1941, డిసెంబర్ 7వ తేదీన అమెరికా మిలిటరీ బేస్ హవాయిలోని పెరల్ హార్బర్‌పై జపాన్ ఆకస్మిక దాడి చేసిన విషయం తెలిసిందే. అమెరికా నౌకా దళాన్ని నిర్వీర్యం చేయాలన్న ఉద్దేశంతో పెరల్ హార్బర్‌పై జపాన్ దాడి చేసింది. రెండో ప్రపంచ యుద్ధంలో అమెరికా దూకుడును అడ్డుకునేందుకు జపాన్ ఆ పనిచేసింది. ఆ అటాక్‌లో సుమారు 2400 మంది అమెరికన్లు మృతిచెందారు. రెండో ప్రపంచ యుద్ధం ముగిసి 8 దశాబ్ధాలు అవుతోంది. కానీ పెరల్ హార్బర్ ఘటన జపాన్ మిత్రదేశాలకు ఇంకా అర్థంకాని అంశమే.
అయితే పెరల్ హార్బర్ ఘటన గురించి తనకు ఎందుకు చెప్పలేదని ప్రెస్మీట్లో ట్రంప్ చేసిన వ్యాఖ్యలతో ఓవల్ ఆఫీసు రిపోర్టర్లు అందరూ ఖంగుతిన్నారు. ట్రంప్ పుట్టడానికి ముందే పెరల్ హార్బర్ ఘటన జరిగింది. డోనాల్డ్ ట్రంప్ 1946, జూన్ 14వ తేదీన జన్మించారు. తన రిప్లైలో పెరల్ హార్బర్‌ను ప్రస్తావించిన ట్రంప్ .. మీరు సర్ప్రైజ్ నమ్ముతారని, అందుకే తాము కూడా అలా దాడి చేశామన్నారు. దీంతో అమెరికా, జపాన్ రిపోర్టర్లు ముక్కున వేలేసుకున్నారు.