Donald Trump : ఇరాన్ (Iran) తో యుద్ధం చేసే విషయంలో, హర్మూజ్ జలసంధి (Strait of Hormuz) ని తిరిగి తెరిపించే విషయంలో నాటో కూటమి నుంచి ఎలాంటి సాయం అందకపోవడంపై అమెరికా అధ్యక్షుడు (US President) డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆ కూటమిపై ఇప్పటికే అనేకసార్లు విరుచుకుపడిన ఆయన.. తాజాగా మరోసారి ట్రూత్ సోషల్ (Truth Social) వేదికగా విమర్శలు చేశారు. నాటో (NATO) అమెరికాకు ఎప్పుడూ మద్దతుగా నిలువలేదని మండిపడ్డారు.
అమెరికాకు అవసరమైనప్పుడు ఎప్పుడూ నాటో కూటమి అండగా లేదని, భవిష్యత్తులోనూ దాని నుంచి తమకు ఎలాంటి మద్దతు లభించదని ట్రంప్ వ్యాఖ్యానించారు. తమ దృష్టిలో నాటో కూటమి గతంలో లేదు, భవిష్యత్తులో ఉండబోదని అసహనం వ్యక్తంచేశారు. కాగా గత కొన్నిరోజులుగా నాటోపై ట్రంప్ విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు. ఇటీవల కూడా నాటో కూటమిని ఒక కాగితపు పులిగా అభివర్ణించారు. కూటమి నుంచి వైదొలిగే యోచనలో ఉన్నట్లు సంచలన ప్రకటన చేశారు.
మరోవైపు అమెరికాలో జన్మించిన తొలి పోప్ లియో-14 (Pope Leo), అగ్రరాజ్య అధ్యక్షుడు ట్రంప్‌ల మధ్య జగడం మరింత ముదురుతోంది. పోప్‌ను ఉద్దేశిస్తూ ట్రంప్ మంగళవారం ఓ పోస్టు పెట్టారు. గత రెండు నెలల్లో ఇరాన్ దాదాపు 42 వేల మంది అమాయకులైన నిరసనకారులను బలిగొన్నదని ట్రంప్ ఆరోపించారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆ దేశం వద్ద అణ్వాయుధాలు ఉండటం సరైనది కాదని ఉద్ఘాటించారు. ఈ విషయం పోప్ లియోకు అర్థమయ్యేలా ఎవరైనా చెప్పాలంటూ ఎద్దేవా చేశారు.
పశ్చిమాసియా యుద్ధంపై పోప్ చేసిన వ్యాఖ్యలపై ట్రంప్ ఘాటుగా స్పందించారు. దాంతో ఇరువురి మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. నాటో నుంచి వైదొలిగే యోచనలో ఉన్నట్లు ట్రంప్ ప్రకటన నేపథ్యంలో.. యూరప్ ప్లాన్ బీపై దృష్టిసారించినట్లు తెలుస్తోంది. ఒకవేళ అమెరికా కూటమి నుంచి వైదొలిగితే.. ప్రస్తుత సైనిక వ్యవస్థలను ఉపయోగించి తనను తాను రక్షించకోగలిగే ఒక ప్రత్యామ్నాయ ప్రణాళికను యూరప్ రూపొందిస్తున్నదని మీడియాలో కథనాలు వస్తున్నాయి. ‘యూరోపియన్ నాటో’ పేరుతో ఈ ప్రతిపాదనపై అధికారులు కృషి చేస్తున్నట్లు కథనాలు వెలువడ్డాయి.