న్యూయార్క్: అమెరికా అటార్నీ జనరల్ పామ్ బాండీ(Pam Bondi)పై డోనాల్డ్ ట్రంప్ వేటు వేశారు. వ్యాపారి, సెక్స్ అఫెండర్ జెఫ్రీ ఎప్స్టీన్ కేసులో ఫైళ్లను సరైన రీతిలో హ్యాండిల్ చేయలేదన్న నెపంతో పామ్ బాండీపై వేటు వేసినట్లు తెలుస్తోంది. వాస్తవానికి ట్రంప్, బాండీ సన్నిహితులే. కానీ ఎప్స్టీన్ ఫైళ్ల కేసును హ్యాండిల్ చేసిన తీరు పట్ల డెమోక్రాట్లు, రిపబ్లికన్లు ఆమెపై ఆగ్రహంగా ఉన్నారు. మన్‌హట్టన్ జైలులో ఎప్స్టీన్ మృతిచెందిన అంశాన్ని కూడా సరైన రీతిలో కవరప్ చేయలేదన్న ఆరోపణలు ఉన్నాయి. ట్రుత్ సోషల్‌లో బాండీకి థ్యాంక్స్ చెప్పారు ట్రంప్. విధ్వంసాన్ని ఎదుర్కోవడంలో ఆమె తీవ్ర పోరాటం చేసినట్లు తెలిపారు. పామ్‌ను ప్రేమిస్తామని, కానీ ఆమె కొత్త జాబ్‌కు వెళ్తోందని, ప్రైవేట్ సెక్టార్లో ఆమె పనిచేయనున్నట్లు ట్రంప్ పేర్కొన్నారు. బాండీకి డిప్యూటీగా చేసిన ట్రంప్ మాజీ లాయర్ టాడ్ బ్లాంకె ఇప్పుడు అటార్నీ బాధ్యతలను స్వీకరించనున్నారు.