Donald Trump : అమెరికా అధ్యక్షుడు (US president) డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ను చంపేస్తామని అర్థం వచ్చే కోడ్‌తో ఎఫ్‌బీఐ మాజీ డైరెక్టర్ (FBI Ex.Director) జేమ్స్ కామీ (James Comey) బెదిరింపులకు పాల్పడటంపై ట్రంప్ స్పందించారు. తన హత్యకు కుట్ర పన్నిన కామీ ఒక ‘బ్యాడ్ కాప్ (Bad Cop)’ అని మండిపడ్డారు. తాజాగా ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు.
‘జేమ్స్ కామీకి ఆ కోడ్ అర్థం కచ్చితంగా తెలుసు. అతను తనను హత్య చేయాలనుకున్నాడనే విషయం స్పష్టంగా అర్థమవుతోంది. కామీ సమర్థుడు కాకపోవచ్చు. కానీ ఆ కోడ్ అర్థం తెలుసుకునే తెలివి ఉంది. కామీ దేశాధ్యక్షుడిని చంపేందుకు పిలుపునిచ్చాడు. అతడు ఒక డర్టీ కాప్ (చెడ్డ పోలీస్ అధికారి)’ అని ట్రంప్ వ్యాఖ్యానించారు. కాగా జేమ్స్ కామీ ‘86 47’ అనే కోడ్‌ను ఇన్‌స్టాలో పెట్టి, డిలీట్ చేశారు. అమెరికా 47వ అధ్యక్షుడిని చంపడం అనే అర్థం వచ్చేలా ఆ రహస్య కోడ్ ఉందని అధికారులు తెలిపారు. దాంతో అతడి చర్యలపై అమెరికా సీక్రెట్ సర్వీస్ సంస్థలు దర్యాప్తు చేస్తున్నాయి.
కాగా తన పోస్టుపై కామీ స్పందిస్తూ.. తాను బీచ్‌వాక్ చేస్తున్న సమయంలో చూసిన షెల్ల చిత్రాన్ని పోస్ట్ చేశానని తెలిపారు. ఆ పోస్ట్‌ను అధికారులు తప్పుగా అర్థం చేసుకున్నారన్నారు. ఆ నెంబర్లను హత్యలు చేయడానికి ఉపయోగిస్తారనే విషయం తనకు తెలియదని చెప్పారు. అమెరికా అధ్యక్షుడిని చంపాలనే ఉద్దేశం తనకు లేదని స్పష్టంచేశారు. పోస్టు పెట్టాక తనపై అసంబద్ధమైన ఆరోపణలు రావడంతో దాన్ని డిలీట్ చేసినట్లు వెల్లడించారు. కామీ పోస్టుపై దర్యాప్తు చేస్తున్నట్లు ఎఫ్‌బీఐ డైరెక్టర్ కాష్ పటేల్ తెలిపారు. ఇప్పటికే సీక్రెట్ సర్వీస్ అధికారులు కామీని ప్రశ్నించినట్లు అక్కడి మీడియా తెలుపుతోంది.
ఇదిలావుంటే గతంలోనూ ట్రంప్‌పై పలుమార్లు హత్యాయత్నాలు జరిగాయి. గత ఏడాది అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో భాగంగా పెన్సిల్వేనియాలో ఏర్పాటు చేసిన ప్రచార కార్యక్రమంలో ఒక దుండగుడు ట్రంప్‌పై కాల్పులు జరిగాయి. అప్పుడు ట్రంప్ కుడి చెవిపై గాయమైంది. అమెరికా సీక్రెట్ సర్వీస్ సిబ్బంది వేగంగా స్పందించి ఆయనను కాపాడగలిగారు. తర్వాత ఫ్లోరిడాలోని వెస్ట్‌పామ్ బీచ్‌లో ట్రంప్ గోల్ఫ్ ఆడుతుండగా ఒక వ్యక్తి ఫెన్సింగ్ వద్దకు తుపాకీతో రావడాన్ని భద్రతా బలగాలు గుర్తించాయి.
అనంతరం కాల్పులు జరిపి అతడిని అరెస్టు చేశాయి. ఆ తర్వాత మరోసారి ట్రంప్ పాల్గొన్న ఒక సమావేశానికి దగ్గారగా ఉన్న ఒక కన్వెన్షన్ సమీపంలో మాస్క్ ధరించిన ఒక సాయుధ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. ఆ వ్యక్తి బ్యాగులో AK-47 తుపాకీ ఉన్నట్లు ఫాక్స్ న్యూస్ పేర్కొంది. బ్యాగులో తూటాల మ్యాగజైన్‌ను కూడా గుర్తించినట్లు సమాచారం. దాంతో ట్రంప్ భద్రతను భారీగా పెంచినట్లు అధికారులు తెలిపారు.