Jinping @ Saudi | చైనా దేశాధ్యక్షుడు జీ జిన్‌పింగ్ సౌదీ అరేబియాలో పర్యటిస్తున్నారు. మూడు రోజుల పర్యటన నిమిత్తం జిన్‌పింగ్ బుధవారం అర్ధరాత్రి రియాద్ చేరుకున్నాడు. సౌదీ అరేబియా పర్యటనలో రెండు దేశాల మధ్య 20 ఒప్పందాలు జరుగనున్నాయని అధికారులు చెప్పారు. జిన్‌పింగ్ సౌదీ పర్యటనతో అగ్రరాజ్యం అమెరికా ఉలిక్కిపడింది. కాగా, జిన్‌పింగ్ విమానం సౌదీ అరేబియా గగనతలానికి చేరుకోగానే సౌదీ రాయల్ ఎయిర్ ఫోర్స్‌కు చెందిన నాలుగు ఫైటర్ జెట్లు దానికి ఎస్కార్ట్‌గా నిలిచాయి. దీంతో పాటు ఆకాశంలో పచ్చని పొగ కూడా కనిపించింది.
సౌదీ అరేబియా పర్యటన నిమిత్తం రియాద్ చేరుకున్న చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌కు రెడ్ కార్పెట్ స్వాగతం లభించింది. రెండు దేశాల మధ్య వివిధ రంగాల్లో మొత్తం 30 బిలియన్ డాలర్ల ఒప్పందాలు జరగనున్నాయి. రెండు దేశాలు మత పరమైన అంశాలను దూరం పెట్టి పూర్తిగా వాణిజ్యంపైనే దృష్టిపెట్టాలని యోచిస్తున్నాయి. ఈ సందర్భంగా జిన్‌పింగ్‌కు సౌదీ అరేబియా సివిలియన్ అవార్డును సౌదీ క్రౌన్ ప్రిన్స్, ప్రధానమంత్రి కూడా అయిన మహమ్మద్ బిన్ సల్మాన్ అందజేయనున్నట్లు స్థానిక అధికారుల ద్వారా తెలిసింది.
గల్ఫ్ దేశాల్లో కాలు మోపేందుకు చైనా చాలా కాలంగా ప్రయత్నిస్తున్నది. ఇప్పటి వరకు ఈ రంగంలో అమెరికాదే ఆధిపత్యం. జిన్‌పింగ్ సౌదీ పర్యటనతో జోబైడెన్ ప్రభుత్వం అసౌకర్యంగా ఉన్నట్లు కనిపించింది. అమెరికా-సౌదీల మధ్య చాలా కాలంగా వివిధ అంశాలపై విభేదాలు ఉన్నాయి. గతంలో డొనాల్డ్ ట్రంప్, జో బైడెన్‌కు సాధారణ స్వాగతం లభించగా.. ప్రస్తుతం జిన్‌పింగ్‌కు మాత్రం రెడ్‌కార్పెట్ పరవడం అమెరికాను ఆశ్చర్యపరుస్తున్నది. హెచ్చరికలను బేఖాతరు చేస్తూ చమురు ఉత్పత్తిని 2 శాతానికి తగ్గిస్తున్నట్లు ప్రిన్స్ క్రౌన్ చెప్పడం అమెరికాకు కోపం తెప్పిస్తున్నది. ఇలాఉండగా, సౌదీ యువ రాజును మచ్చికచేసుకునేందుకు జర్నలిస్ట్ కషోగ్గి హత్య కేసులో ఆయనకు మినహాయింపు ఇస్తున్నట్లు అమెరికా ప్రకటించింది. ఇంతచేసినా చైనా అడుగులకు మడుగులొత్తడం పట్ల అమెరికా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నది.