Today Hisotyr: ప్రసిద్ధ నటుడు చార్లీ చాప్లిన్ పేరు వినని వారు ఉండరంటే అతిశయోక్తి కాదు. ఎన్నో ఒడిదొడుకులను తట్టుకుని స్వశక్తితో పైకొచ్చి ప్రపంచ సినిమా చరిత్రలో తనకంటూ ఒక ప్రత్యేక పేజీని లిఖించుకున్నారు. చార్లీ చాప్లిన్ నటించిన తొలి సినిమా 1914 లో సరిగ్గా ఇదే రోజున విడుదలైంది. ఈ సినిమా పేరు ‘మేకింగ్ ఎ లివింగ్’. ఈ సినిమాలో తన చిలిపితనంతో కూడిన నటనతో ప్రపంచవ్యాప్తంగా సినీ అభిమానులను నవ్వించాడు. అందర్నీ నవ్వుల్లో ముంచెత్తిన ఈ నటుడి జీవితంలో పెను దుఃఖం దాగి ఉన్నది.
తొలి సినిమాలో చార్లీ చాప్లిన్ ‘థగ్’ పాత్రలో నటించాడు.హెన్రీ లెహర్మాన్ ఈ చిత్రానికి రచయిత, దర్శకుడిగా వ్యవహరించారు. 15 నిమిషాల నిడివి ఉన్న ఈ చిత్రం పూర్తిగా కామెడీ జోనర్‌గా తీశారు. అలాగే, పూర్తిగా మూకీ సినిమా. తన యాక్షన్, ఎక్స్‌ప్రెషన్స్‌తో యావన్మంది ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించారు. దాంతో ఆయన పేరు ప్రపంచవ్యాప్తంగా మార్మోగిపోయింది. అంతే, అప్పటి నుంచి వెనుదిరిగి చూసుకోకుండా ఎన్నో విజయవంతమైన సినిమాలను అందించారు.
చార్లీ చాప్లిన్ 1889 ఏప్రిల్ 16న లండన్‌లో జన్మించాడు. బాల్యంలో ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నారు. తండ్రి మద్యానికి బానిసగా మారడంతో కుటుంబం రోడ్డుకెక్కింది. దాంతో ఏడేండ్ల వయసులో చాప్లిన్ ఒక ఆశ్రమంలో ఉండాల్సి వచ్చింది. చదువు మానేసి చాప్లిన్ 13 వ ఏట వినోద ప్రపంచంలోకి ప్రవేశించాడు. నృత్యంతో పాటు స్టేజ్ నాటకాలలో కూడా పాల్గొనడం ప్రారంభించాడు. ఈయన నటనకు మెచ్చి అమెరికన్ ఫిల్మ్ స్టూడియోకి ఎంపికచేశారు. ఇక అప్పటి నుంచి ప్రపంచవ్యాప్తంగా మూకీ చిత్రాలకు రారాజుగా అవతరించాడు. ఈయన నటించిన పూర్తి నిడివి చిత్రం ‘ది కిడ్’ 1921లో విడుదలైంది. ఈయన నటించిన సినిమాల్లో ముఖ్యంగా ఎ ఉమెన్ ఆఫ్ పారిస్, ది గోల్డ్ రష్, ది సర్కస్, సిటీ లైట్స్, మోడరన్ టైమ్స్ ఎంతో పాపులర్ అయ్యాయి. వృత్తిపరమైన జీవితంలో కూడా ఒడిదొడుకులు ఎదుర్కొన్నారు. ‘ది గ్రేట్ డిక్టేటర్’ సినిమాలో హిట్లర్ పాత్రను పోషించి కమ్యూనిస్టుల ఆగ్రహానికి గురయ్యాడు. దాంతో అమెరికాను విడిచిపెట్టిన చార్లీ చాప్లీన్.. స్విట్జర్లాండ్‌లో స్థిరపడ్డాడు. చార్లీకి 4 వివాహాలు జరగ్గా.. వారి ద్వారా 11 మంది పిల్లలు పుట్టారు.
2004: సుదీర్ఘంగా 237 వారాల పాటు నంబర్ వన్ ఆటగాడిగా నిలిచి కొత్త రికార్డు నెలకొల్పిన టెన్నిస్ క్రీడాకారుడు రోజర్ ఫెదరర్
1990: ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్‌పై 30 ఏళ్ల నిషేధం ఎత్తివేత
1915: పాకిస్తాన్‌లోని హల్దాయిలో కుష్వంత్ సింగ్ జననం
1862: కోల్‌కతా సుప్రీంకోర్టుకు మొదటి భారతీయ ప్రధాన న్యాయమూర్తిగా నియమితులైన శంభునాథ్ పండిట్
1814: కోల్‌కతా మ్యూజియం స్థాపన