Sundar Pichai | శాన్ ఫ్రాన్సిస్కో: గూగుల్లో అన్నీ మారాయని, పని చేయడంలో లభించే థ్రిల్(పులకరింత) మాత్రం మారలేదని ఆ సంస్థ సీఈఓ సుందర్ పిచాయ్ అన్నారు. గూగుల్లో తాను ఉద్యోగంలో చేరి రెండు దశాబ్దాలు పూర్తయిన సందర్భంగా ఇన్స్టాగ్రామ్లో తన సంతోషాన్ని ఆయన పంచుకున్నారు.
“నేను 2004 ఏప్రిల్ 26న గూగుల్లో అడుగు పెట్టాను. అప్పటి నుంచి చాలా మార్పులు వచ్చాయి. సాంకేతికత, మా ఉత్పత్తులను ఉపయోగించేవారి సంఖ్య వంటివెన్నో మారాయి. కానీ మారనిది – ఈ అద్భుతమైన కంపెనీలో పని చేయడం ద్వారా నేను పొందే థ్రిల్. 20 ఏళ్లు గడిచాయి. నేను ఇప్పటికీ అదృష్టవంతుడిగానే భావిస్తున్నాను” అని తెలిపారు. కొద్ది గంటల్లోనే ఆయన పోస్టుకు 1,32,400 లైక్లు వచ్చాయి.