ఏ క్షణమైనా రష్యా ఉక్రెయిన్‌పై దాడికి దిగొచ్చన్న వార్తల నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ రష్యా అధ్యక్షుడు వ్లాదిమీర్ పుతిన్‌తో ఫోన్లో సుదీర్ఘంగా సంభాషించారు. దాదాపు 60 నిమిషాల పాటు వీరిద్దరి సంభాషణ జరిగింది. ఈ విషయాన్ని వైట్‌హౌజ్ అధికారులు కూడా ధ్రువీకరించారు. ఉక్రెయిన్‌పై దాడులు చేస్తే మాత్రం పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని అమెరికా అధ్యక్షుడు రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో తెగేసి చెప్పారని సమాచారం. ఒక వేళ ఉక్రెయిన్‌పై రష్యా గనక దాడికి దిగితే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని బైడెన్ తీవ్రంగా హెచ్చరించారు. మానవాళి కూడా తీవ్రంగా నష్టపోతుందని జోబైడెన్ ఈ సంభాషణలో అభిప్రాయపడ్డారు.
ఇద్దరి మధ్యా దౌత్యం నెరపడానికి పశ్చిమ దేశాలు రెడీగా ఉన్నాయని పేర్కొన్నారు. కాదు కూడదంటూ ఉక్రెయిన్‌పై దాడులు చేస్తే మాత్రం.. తరువాత సంభవించే పరిణామాలకు కూడా సిద్ధంగానే ఉండాలని, ఎన్నడూ చూడని విధంగా ఆంక్షలుంటాయని జోబైడెన్ హెచ్చరించినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా రష్యాపై కఠిన ఆర్థిక ఆంక్షలు కూడా విధిస్తామని, ఇందుకు అమెరికా, దాని మిత్రదేశాలు కూడా రెడీగా ఉన్నాయని బైడెన్ పుతిన్‌తో చెప్పారు. ఇరు దేశాల మధ్య దౌత్యం నెరపడానికి అమెరికా, మిత్ర దేశాలు రెడీగానే ఉన్నాయని, కాదూ కూడదంటూ ఉక్రెయిన్‌పై దాడులు చేస్తే.. అంతే రీతిలో స్పందించడానికి కూడా సిద్ధంగానే ఉన్నామని అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో చెప్పారని వైట్‌హౌజ్ వర్గాలు పేర్కొన్నాయి.
ఫ్రెంచ్ ప్రెసిడెంట్‌తో ఫోన్లో సంభాషించిన పుతిన్
అమెరికా అధ్యక్షుడు జోబైడెన్‌తో ఫోన్లో సంభాషించే కంటే ముందే రష్యా అధ్యక్షుడు పుతిన్ ఫ్రెంచ్ ప్రెసిడెంట్ ఇమ్మాన్యుయెల్‌తో ఫోన్లో సంభాషించారు. తాము ఉక్రెయిన్‌పై దాడికి దిగుతున్నామన్న వార్తలు అవాస్తవమని, అవన్నీ ఊహాగానాలే అని ఆయన దృష్టికి తెచ్చారు. అయితే ఇరు దేశాల మధ్య కాస్త ఉద్రిక్తతలను తగ్గించడానికి ఇమ్మాన్యుయెల్ ప్రయత్నిస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. అయితే మిలటరీ అలయన్స్‌లోకి ఉక్రెయిన్ను తీసుకోవద్దని తాము డిమాండ్ చేస్తున్నామని, ఈ డిమాండ్‌పై అమెరికా సానుకూలంగా స్పందించడం లేదని పుతిన్ ఫ్రెంచ్ ప్రెసిడెంట్ ఇమ్మాన్యుయెల్‌కు ఫిర్యాదు చేశారు. అలాగే తూర్పు ఐరోపా నుంచి నాటో తన బలగాలను ఉపసంహరించుకోవాలన్న డిమాండ్‌పై కూడా అమెరికా సానుకూలంగా స్పందించలేదని పుతిన్ ఇమ్మాన్యుయెల్ దృష్టికి తీసుకొచ్చారు.