అడిలైడ్, నవంబర్ 19: ఆస్ట్రేలియాలోని అడిలైడ్‌లో భారతీయులను ఉద్దేశించి జాత్యహంకార బోర్డు వెలిసింది. ఓ తపాలా కార్యాలయం ముందు ‘వెలుతురు, ఫొటో బ్యాగ్రౌండ్ క్వాలిటీ కారణంగా మేం భారతీయుల ఫొటోలు తీయలేం’ అని రాసి ఉంచారు. దీనిపై అక్కడి భారతీయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ శరీర ఛాయను హేళన చేసేలా ఈ బోర్డు ఉన్నదని ఓ ప్రవాస భారతీయుడు ఆరోపించారు. స్థానిక రాజకీయ నాయకులు, ఇతర కమ్యూనిటీ నేతలు కూడా అభ్యంతరం వ్యక్తం చేశారు. వెంటనే ఆ బోర్డును తొలగించాలని ఆస్ట్రేలియా పోస్ట్‌ను డిమాండ్ చేశారు. విమర్శలు వెల్లువెత్తటంతో ఆస్ట్రేలియా పోస్ట్ భారతీయ సమాజానికి క్షమాపణ చెప్పింది. ఆ నోటీసును తొలగిస్తామని తెలిపింది.